TG Assembly | తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. ఈ నెల 9న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 16వ తేదీకి వాయిదా పడ్డాయి. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు వరుసగా ఆరు రోజుల పాటు జరిగాయి. మొత్తంగా ఏడు రోజుల్లో 37 గంటల 44 నిమిషాల పాటు సభ నడిచింది.
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ ఏడాది పాలనలో నెలకొన్న పలు ప్రజా సమస్యలపై చర్చించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. లగచర్ల రైతులు, ఆటో డ్రైవర్ల సమస్యలు, ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంశాలపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని చర్చించేందుకు అంగీకారం తెలపలేదు. కానీ తమకు అవసరం అనుకున్న విషయాలపై చర్చను జరిపింది. అంతేకాకుండా భూమాత సహా పలు బిల్లులను ఈ సమావేశాల్లోనే సభలో ప్రవేశపెట్టింది.
ఇక అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజైన శనివారం నాడు మాత్రం రైతు భరోసా, రైతు రుణమాఫీ, 24 గంటల కరెంటుపై బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. రైతు రుణమాఫీ, రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా నిలదీశారు. ఇక చివరలో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.