ఎద్దేడ్చిన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం బాగుపడదని పెద్దల మాట. ఈ మాట ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ రైతాంగానికి అక్షరాలా సరితూగే వాస్తవం. తలాపున గోదారి పారుతున్నా.. తెలంగాణ భూములు ఎడారిని తలపించినయి. బిరబిరా కృష్ణమ్మ పరుగులు తీస్తుంటే.. ఆ నురగల చెమ్మ సుత తెలంగాణ భూముల దూప తీర్చలేదు. అప్పులబాధకు.. దూలానికి వేలాడిన రైతు గొంతులెన్నో. రాష్ట్రం ఏర్పడే నాటికి కొసపానంతో ఉన్న సాగును, రైతును తెలంగాణ ప్రభుత్వం గుండెలకు హత్తుకున్నది. రైతు సంక్షేమమే ధ్యేయంగా పాలిస్తూ సేద్యాన్ని నెత్తిన పెట్టుకొన్నది. అన్నదాత అరిగోసలను తీర్చి ‘నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి’ అనే మాటను నిజం చేసింది. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల తరుణంలో రైతు జీవితాల్లో, సాగుబడిలో జరిగిన పురోగతిపై ప్రత్యేక కథనం..
రైతుకు వచ్చిన పని.. నచ్చిన పని.. తెలిసిన పని ఒక్కటే.. వ్యవసాయం. సాగునీళ్లు లేకపోతే చెమటతో పంటకు తడి పెట్టి బతికించుకుంటడు. తీరా.. మార్కెట్‌కి వెళ్లాక దళారులు దగా చేస్తే.. ఇంటికొచ్చి కన్నీరు పెట్టుకుంటడు. దళారులిచ్చే ధరల దెబ్బకు రైతు గుండెకు తగిలే గాయాలు లెక్కపెట్టలేం. సాదుకున్న జీవాలను మేతలేక కబేళాకు అమ్ముతూ.. కంటి నుంచి ఉత్త కన్నీరు కాదు.. నెత్తుటి కన్నీరు కారుస్తడు. ఎప్పుడొస్తదో.. ఎప్పుడు పోతదో తెల్వని కరెంటుకు కావలి గాసి పంటకు తడి పెడుతడు. కాలం కాటు వేస్తే.. అదే కరెంట్ షాక్ కొట్టి కాలం జేస్తడు. మద్దతు ధర రాక, పంట సాయం లేక రైతన్న అనుభవించిన అరిగోస అంతా ఇంతా కాదు. ఎండిపోయిన బతుకులను కాపాడుకుందామని తిరిగిన భూమిని, పెరిగిన ఊరిని వదిలి వలస బాట పట్టిన రైతు గుండెకోత మాటల్లో చెప్పలేనిది. ఇప్పుడు కాలం మారింది. రైతు కథ కూడా. గాయాల పాలైన రైతన్న గతం.. ఇక గతం మాత్రమే. తెలంగాణ స్వరాష్ట్రం అవతరించిన తర్వాత రైతు రాజయ్యిండు. సాగునే నమ్ముకున్న తాను.. గోసలకు గోవింద పలికి.. ప్రగతి బాటలో సాగును సాగిస్తున్నడు.
వ్యవసాయం.. రైట్ రైట్
కరువు అనే పదానికి పాలమూరు పర్యాయపదంలా ఉండేది. ఎండిన డొక్కలతో.. కరువును జయించేందుకు.. నాగలి వదిలి తాపీ పట్టుకుని మేస్త్రీలుగా మారిన రైతులెందరో ఆ జిల్లాలో. నేలమ్మపొత్తిళ్లలో విత్తనాలను సాదుకున్న పాలమూరు రైతు.. పట్నం అడ్డ మీద కూలీగా దైన్యస్థితిని అనుభవించిండు. సొంత రాష్ట్రమైనంక సరికొత్త వ్యవసాయ ప్రణాళికలను అమలు చేసింది రాష్ట్ర సర్కార్. అడ్డమీద నిలబడ్డ రైతన్నను పల్లెబాట పట్టించి.. పొలాలనన్నీ హలాల దున్నించి ఇలాతలంలో బంగారం పండించింది. కన్నీళ్లు పారిన పాలమూరు కాల్వల్లో సాగునీటిని పారించింది. రైతు భుజాల మీదున్న కరువు బరువు దింపింది. ‘మేం ముగ్గురం అన్నదమ్ములం. కండక్టర్‌గా పనిజేశి పోయినేడాదే రిటైర్ అయిన.
మా ముగ్గురికి కలిపి 12 ఎకరాల భూముంది. అంత నేనే కౌలు చేస్తున్న. ప్రభుత్వం కూడా రైతుకు బాగా సాప్దార్ ఇస్తుంది’ అంటున్నడు రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్, వనపర్తి జిల్లా గోపాల్ పేటకు చెందిన నరేందర్. ఇతర రాష్ర్టాల్లో వ్యవసాయం దండుగ అని ఒకవైపు లక్షలాది మంది రైతులు సెక్యూరిటీ గార్డులు, కూలీలుగా మారుతుంటే తెలంగాణలో మాత్రం వ్యవసాయం పండుగ అయింది. అందుకు నరేందరే చిన్న ఉదాహరణ. పండించిన ధాన్యాన్ని కాపాడుకోవాలంటే రైతుకు ఒకప్పుడు కంటిమీద కునుకు ఉండకపోయేది. మార్కెట్ యార్డులో దళారుల దగా. మిల్లుకు ధాన్యం పోస్తే మిల్లర్లు ఇచ్చిన రేటుకు చచ్చినట్టు అమ్మాల్సిందే. కానీ.. ఇప్పుడు దళారుల దందా బంద్. పొలంలో, మార్కెట్లో, మార్కెట్ యార్డులో కూడా రైతుదే రాజ్యం.. రైతే రాజు. ‘కాల్వ నీళ్లతో వరి పండించిన. రెండు ట్రాలీల వడ్లు ఎల్లినయి. వనపర్తి మార్కెట్ షెడ్డు కింద కుప్పపోశిన.
ఒకప్పుడు యార్డుకి ధాన్యం తెచ్చినంక వానొస్తే అంతే సంగతి. ఇప్పుడు ఆ తిప్పలు తప్పింది’ అంటున్నది చిన్నగుట్టపల్లి తండాకు చెందిన కమలమ్మ. చెమటోడ్చి పండించిన పంటను అమ్ముకుందామని మార్కెట్ యార్డ్‌కి తెస్తే.. అదాటున వానొస్తే ధాన్యాన్ని వదిలి దాపున చేరలేక.. తడుస్తున్న ధాన్యాన్ని కాపాడుకోలేక ఏడ్చే రైతు కన్నీళ్లు సుత వాననీళ్లల్ల కలిసిపోయేవి. ఇప్పుడు పండించిన పంటను మార్కెట్ యార్డ్‌కి తెచ్చిన రైతు దర్జాగా కుర్చీలో కూర్చొని అమ్ముకుంటున్నడు. తడిధాన్యాన్ని సిమెంట్ కల్లాలలో ఆరబెట్టుకుంటున్నడు. మార్కెట్ యార్డులోని డైనింగ్ హాల్లో బువ్వ తిని, ఫిల్టర్ వాటర్ తాగుతున్నడు. ఒకప్పుడు యార్డుకు వచ్చే మహిళా కూలీలు, మహిళా రైతులు మూత్రానికి వెళ్లాలంటే చాటు లేని పరిస్థితి ఉండె. ఆత్మగౌరవం చంపుకొని గోడల చాటుకు, చెట్ల చాటుకు వెళ్లేవాళ్లు. ఇప్పుడు ప్రత్యేక మూత్రశాలలు, 24 గంటలు నీటి వసతి ఉంది. మార్కెట్ యార్డులు మారా యనేందుకు ఈ ఉదాహరణ చాలదా!
మంచిగ సదివిస్తున్న
మార్కెట్ యార్డుకు తెచ్చిన ధాన్యం.. అమ్ముడుపోతదో.. తడిశిపోతదో అన్న భయం ఉండేది ఒకప్పుడు. కొత్త మార్కెట్ యార్డులు కట్టినంక పందికొక్కులు, దొంగల ఫికర్ పోయింది. మా ఊరికి కాల్వలొచ్చి నీళ్ల సౌలత్ పెరిగినంక పంటలు మంచిగ పండినయ్. కష్టాలు తీరినయ్. నా ఇద్దరు బిడ్డలను ఎంఎస్సీ దాకా సదివించిన. కొడుకు డిగ్రీ చదువుతున్నడు.
-ఆంజనేయులు ముమ్మళ్లపల్లి గ్రామం
పందికొక్కుల పీడ ఇరగడైంది..
నాకు నాలుగెకరాలు ఉంది. రెండెకరాలు బుడ్డలు (పల్లీ) ఏశిన. అర ఎకరం మినుములు ఏశిన. ఎకరంనర వరి ఏశిన. పల్లి మూడు క్వింటాళ్లు ఎల్లింది. మినుములు 4 క్వింటాళ్లు ఎల్లినయ్. ఒకప్పుడు పంట ఖర్సు బాగ ఉంటుండె. అన్ని లెక్కలు పోనూ.. పైసల్ మీద పడేది. కాడు ఎత్తేసి.. కాటికి పోయింది బాగు అనుకున్న రోజులు గుడ్క ఉన్నయ్. భూమిని ఇడ్శిపెట్టి పోలేక దుఃఖపడ్డ రోజులకైతే.. లెక్కలేదు. ఇప్పుడు శాన మారింది. ధాన్యానికి మంచి ధర వొస్తున్నది. పంటకు సరిపోను నీళ్లున్నయి. కరెంట్ ఉన్నది. మార్కెట్ యార్డుకు తెచ్చిన ధాన్యం.. పందికొక్కుల పాలైతదో? దొంగల పాలైతదో అనే ఫికర్ లేదు’ అంటున్నడు రైతు ఆంజనేయులు. ఈ సంతోషం ఒక్క ఆంజనేయులుదే కాదు.
రాష్ట్రంలో ఎంతోమంది రైతులది. ‘ఏడాదిన్నర క్రితం వనపర్తి మార్కెట్ యార్డ్ ప్రారంభం అయింది. 43 ఎకరాల్లో 44 కోట్లు పెట్టి కట్టిర్రు దీన్ని. అన్ని సౌలతులున్నయి. వనపర్తి మార్కెట్ యార్డ్‌కి మొత్తం ఏడు మండలాల రైతులు ధాన్యం తెస్తరు. 140-150 గ్రామాల రైతులకు మంచి వసతి దొరికింది. రోడ్డు ఇరుకై రైతులు, వాహనాదారుల మధ్య గొడవలు అయ్యేటివి. ఇప్పుడు ఆ రంది లేదు. విశాలమైన మార్కెట్ యార్డును చూస్తుంటే నాకే చాలా సంతోషమైతుంది. ఇగ రైతులు ఎంత ఆనందంగా ఉన్నరో చెప్పాల్సిన అవసరం లేదు’ అంటున్నడు వనపర్తి మార్కెట్ యార్డ్ సెక్రటరీ లక్ష్మయ్య గౌడ్. వసతులు కల్పిస్తే సంతోషపడేది రైతులు మాత్రమే కాదు.. వారి కోసం పనిచేసే అధికారులు కూడా అనేందుకు ఇదొక తార్కాణం.
మద్దతు ధర
సాగునీటి సౌకర్యాల ప్రణాళిక, ప్రాజెక్టుల నిర్మాణం, ప్రారంభం, శరవేగంగా పూర్తికావడం వల్లనే నేడు తెలంగాణ పచ్చబడ్డది. రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందితే.. ఇప్పుడు మొత్తం 73 లక్షల 33వేల ఎకరాలకు నీళ్లు పారుతున్నయి. 2014-15లో కేవలం ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు అయితే.. ఇప్పుడు 2కోట్ల 2లక్షల టన్నులు. ఒకప్పుడు కూరగాయల మార్కెంట్లంటే చిత్తడికి, చెత్తకుప్పలకు నెలవు. ఒక పట్టా పరుచుకొని రైతులు బజార్లలో కూరగాయలు అమ్ముకునేవాళ్లు. ఎండకు ఎండినా.. వానకు తడిచినా.. కూరగాయలు అమ్ముడుపోయిన తర్వాతనే ఇంటిబాట పట్టేవాళ్లు. ఆ తిప్పలు తప్పిస్తూ.. సమీకృత మార్కెట్ల నిర్మాణంతో రైతుల గౌరవం పెరిగింది. ఏ సెక్షన్‌కి ఆ సెక్షన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి రైతులకు ఎనలేని వసతి కల్పించింది రాష్ట్ర సర్కార్. ఇప్పుడు తెలంగాణ మార్కెట్ అంటే ఇతర రాష్ర్టాలలోని మార్కెట్లకు రోల్ మోడల్. ఇక గోదాంల విషయానికి వస్తే.. తెలంగాణ రాకముందు ఈ ప్రాంతానికి 176 గోదాంలు మాత్రమే ఉండేవి. ప్రత్యేక రాష్ట్రమైన తర్వాత 1024 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వం 330 గోదాములు నిర్మించింది. అన్నం పెట్టే అన్నదాత ఆనందమే స్వరాష్ట్ర సంపద అని నమ్మాడు సీఎం కేసీఆర్. కాబట్టే, ఆకలి కేకల తెలంగాణ.. నేడు అన్నం పెట్టే అన్నపూర్ణ అయింది.
షాపింగ్ మాల్స్ లెక్కనే ఉన్నయ్..
మార్కెట్ యార్డుకు వచ్చి రైతులు ధాన్యం ఆరబెట్టుకుంటున్నరు. కొత్తగా సిమెంట్ కల్లాలు కడుతున్నం. వానకు ధాన్యం నానకుండా కావాల్సినన్ని పట్టాలు (కవర్లు) ఉన్నయ్. రైతులకు, హమాలీలకు శానా.. మేలు జరిగింది. పట్నంల ఉండే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కూడా మా మార్కెట్ యార్డులెక్క ఉండవు. ఇక్కడ అన్ని వసతులున్నయ్.
– జి. లక్ష్మయ్య గౌడ్, వనపర్తి మార్కెట్ యార్డు సెక్రటరీ
జమ్ము ఉంటే చెమ్మ ఉన్నట్టే
‘మా భూములల్ల తొండలు సుత గుడ్లు పెట్టేయి కావు. ఇప్పుడు జమ్ము గడ్డి మొలుస్తున్నది. నీళ్ల పదును ఉంటెనే ఆ గడ్డి పెరుగుతది. ఇప్పుడు ఏ ఊర్ల సూశిన.. మస్తు జమ్ముగడ్డి ఉంది. జమ్ము ఉంటే చెమ్మ ఉన్నట్టే.
– మల్లయ్య, మేస్త్రీ, మంతటి గ్రామం, నాగర్ కర్నూల్
శానా బాధలు పడ్డం
30 ఏండ్ల సంది చాటకూలీ పని చేస్తున్న. మా బాధలు పట్టించుకున్న బాంధవుడే లేడు. యార్డుకు వచ్చినంక ఆడోళ్లు అవతలికి (మూత్రానికి) పోవాలంటే మస్తు తిప్పలుండె. కొత్త మార్కెట్ యార్డ్డు కట్టినంక మంచిగనిపిస్తున్నది. మూత్రశాలలు కట్టిర్రు. తినెటందుకు రూమ్‌లు కట్టిర్రు. ఫ్యాన్లు సుత ఉన్నయ్.
– వల్లమ్మ, చాటకూలీ, వనపర్తి
…? సుంకరి ప్రవీణ్ కుమార్
నర్రె రాజేష్, యాదగిరి రెడ్డి
Market