ఎన్నికలు రావడం పోవడం సహజమే. అందులో కొన్ని మాత్రం ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ప్రజలకూ లీడర్లకూ మధ్య సంబంధ బాంధవ్యాలను గుర్తు చేసేలా సాగుతాయి. అచ్చం అలాంటి ఉప ఎన్నికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సాగుతున్నది. అక్కడి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఆ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఆయన భార్య మాగంటి సునీత గోపీనాథ్ నిలబడ్డారు. ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఆయన గురించి వినిపించే ఒక్కో మంచి మాట తనలో మరింత స్ఫూర్తిని నింపుతున్నదనీ, ఒక మంచి నేతగానే కాదు, మంచి భర్తగా, గొప్ప తండ్రిగా ఆయన తనకు గుర్తుండిపోతారని ఆమె చెబుతున్నారు. గోపీనాథ్‌తో తన సుదీర్ఘ ప్రయాణం గురించీ, ఆయనతో అనుబంధం గురించీ ‘జిందగీ’తో ఎన్నో సంగతులు పంచుకున్నారు మాగంటి సునీతా గోపీనాథ్.
మా ప్రాంతంలో ఆడవాళ్లంతా మావారిని ‘గోపన్నా… గోపన్నా’ అని ప్రేమగా పిలుస్తారు. ప్రజాభిమానాన్ని చూరగొనడం గొప్పే అయినా మహిళా ఓటర్ల మెప్పు పొందడం అన్నది చాలా పెద్ద విషయం. దీనికి కారణం మహిళల పట్ల ఆయన చూపే ప్రత్యేక ఆదరణే. కష్టం అని ఏ ఆడపిల్ల తన దగ్గరికి సాయం కోసం వచ్చినా ఖాళీ చేతులతో పంపిన దాఖలాలు నాకు తెలియదు. మహిళల్ని అంత గొప్పగా చూసే మనిషికి భార్యను కావడం నేను అదృష్టంగా భావిస్తాను. నా విషయంలోనూ ఆయనెప్పుడూ ఎంతో ప్రేమ, ఆదరణ చూపించేవారు. కుటుంబ బాధ్యతల్లో నాకే స్వతంత్రం ఇచ్చేవారు. అయితే ఇంటితో పోలిస్తే ఆయనకు నియోజకవర్గమే తొలి ప్రాధాన్యంగా ఉండేది. ఒక ప్రజానేత భార్యగా ఆయన ఆలోచనల్నీ, అక్కడి అవసరాల్నీ నేనూ అర్థం చేసుకునేదాన్ని. కాబట్టి ఆ విషయంలో ఇద్దరిదీ ఒకేదారి అయింది.

మాది పెద్దలు కుదిర్చిన వివాహం. నన్ను చూడ్డానికి వచ్చి వెళ్లాక కేవలం మూడు రోజుల్లోనే పెండ్లి అయిపోయింది. ద్వారకా తిరుమలలో నిరాడంబరంగా మా పెండ్లి జరిగింది. నాటి నుంచీ వెళ్లిపోయేదాకా ఆయన నా చేయి వదిలిన సందర్భమే లేదు. మా బంధువుల ద్వారా ఆయన గురించి నాకు ముందే తెలుసు. ఇంట్లో అడుగుపెట్టాక మరిన్ని విషయాలను పరిశీలన ద్వారా తెలుసుకున్నా. ఇష్టాలు, అయిష్టాలు అర్థం చేసుకుని అన్నీ అమర్చిపెట్టేదాన్ని. ముఖ్యంగా ఆయన వేసుకునే విభిన్నమైన డ్రెస్‌ల గురించి చాలామంది అడుగుతుంటారు. వాటిని నేనే సెలెక్ట్ చేసి తెచ్చేదాన్ని. అవి వేసుకున్నాక ఎవరైనా బాగుందని చెబితే నాతో చెప్పేవారు. ఆయన అలా రంగురంగుల్లో డిఫరెంట్‌గా కనిపించడం నాకెంతో ఇష్టం. అందుకే ఉత్సాహంగా దుస్తులు ఎంచేదాన్ని.
పనుల్లో ఎక్కడ తిరుగుతున్నా.. అక్కడికే భోజనం పంపేదాన్ని. మరో విషయం చెప్పాలి. ఆయన చాలా భోళా మనిషి. స్నేహితులూ ఎక్కువే. అయితే కొన్ని సందర్భాల్లో చుట్టూ ఉండేవారే ఆయనకు ఇబ్బందులు తెచ్చిపెట్టే పనులు చేయడం, అలాంటి మాటలు మాట్లాడటం గమనించేదాన్ని. కానీ, ఆయన దృష్టికి తీసుకెళ్లి, వాళ్ల స్నేహం పాడు చేయడం నాకు ఇష్టం ఉండేది కాదు. అందుకే, అలాంటి సందర్భాల్లో అవతలి వ్యక్తులతో నేను విడిగా మాట్లాడి, ఆయన మనసు గురించి వివరించి చెప్పేదాన్ని. ఇలాంటి పనుల వల్ల స్నేహబంధాన్ని ఇబ్బంది పెట్టుకోవద్దంటూ చెప్పడం వల్ల చాలాసార్లు సమస్యలు ఆదిలోనే సమసిపోయేవి. అవసరం అనిపిస్తే, ఈ సంగతులు ఆయనతో వేరే సందర్భంలో పంచుకునేదాన్ని.
కరోనా సమయంలో తలసేమియా రోగులకు సంబంధించిన సంస్థ ఒకటి ఆయన్ను సంప్రదించింది. ఆ జబ్బు ఉన్న వాళ్లకి రక్తం ఎక్కిస్తూ ఉండాలి. అసలు జనాలు బయటికి వచ్చే అవకాశమే లేని ఆ సమయంలో రక్తం ఎక్కడ దొరుకుతుంది? కానీ ఎలాగైనా వాళ్లకు సాయం చేయాలనుకున్నారు ఆయన. అందుకే మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌కు పిలుపునిచ్చారు. దీంతో ఒకే రోజులో 2,425 మంది రక్తదానం చేశారు. అత్యధిక మంది రక్తదానం చేసిన ఈవెంట్‌గా ఇది ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో నమోదైంది. క్లిష్ట సమయంలోనూ ఆయన రోగులకు సాయం చేయడం నాకెంతో గుర్తుండిపోయిన సందర్భం.
నిద్ర లేచింది మొదలు పడుకునేదాకా ఆయన మనసులో తిరిగే తొంభైశాతం విషయాలు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల గురించే. ఇండ్లలోకి నీళ్లు రావడంలాంటి ఇబ్బందులతో ఎవరన్నా వచ్చినప్పుడు మాతో కూడా చెప్పి బాధపడేవారు. ‘మనం ఇంత శుభ్రమైన చోట ఉన్నాం, పాపం వాళ్లు అలా ఎలా ఉంటున్నారో…’ అనేవారు. అలాంటి సందర్భాల్లో తక్షణమే సాయం అందించేవారు. ఎవరైనా సరే, తమకి ఈ సాయం కావాలి అంటూ వస్తే చాలు… తనకు ఏమాత్రం వీలున్నా చేసేవారు. ఒకవేళ తనకు అవకాశం లేకపోతే ప్రత్యామ్నాయం వెతికి సూచించేవారు. 30 సంవత్సరాల నుంచీ పెండింగ్‌లో ఉన్న సమస్యల్ని కూడా ఆయన పరిష్కరించిన సందర్భాలు నాకు తెలుసు. ప్రతిరోజూ ఎమ్మెల్యే ఆఫీసులో ప్రజలకు అందుబాటులో ఉండేవారు. ఎవరైనా ఆయన్ను కలవచ్చు. రాత్రి ఇంటికొచ్చాక ఆ రోజు చేసిన సాయం ఏదైనా ఉంటే అది తలుచుకుని తృప్తి పడేవారు. ఆయన తీరు అంతే.
మేం ప్రజల్లోకి వెళ్లి అనేక మందిని కలుస్తున్నప్పుడు రకరకాల సందర్భాల్లో ఆయన్ను గుర్తుచేస్తున్నారు. చర్చి దగ్గరికి వెళితే ఒక మహిళ వచ్చి.. ‘అప్పట్లో ఒకసారి మాకు హాస్పిటల్లో 5 లక్షల బిల్లు అయింది. కట్టే పరిస్థితి లేదు. ఆ విషయం చెబితే ఒకే ఒక్క నిమిషంలో ఆ డబ్బులు సర్దేసి, మమ్మల్ని ఇంటికి పంపించారు. దేవుడి లాంటి మనిషి’ అని ఆయన చేసిన సాయాన్ని గుర్తుచేసుకుంది. వెంగళరావు నగర్లో మరో మహిళ కూడా, ‘మా ఇల్లు ఆయన చలవే’ అంటూ కళ్లనీళ్లు పెట్టుకుంది. జనంలోకి వెళితే ఇలాంటి మాటలెన్నో వింటున్నా! ఎవరికైనా ఇలా సాయం చేసేటప్పుడు అవతలి వాళ్లకు మాటిచ్చేసి, నాకు డబ్బులు పంపమని ఫోన్ చేసేవారు. అంటే, ఎవరైనా ఒక లక్ష రూపాయలు కావాలంటే సరే అని… ఇంటికి ఫోన్ చేసి లక్ష పంపు అనేవారు. అక్కడ ఉన్నాయా లేవా అన్నది కూడా చూసుకునేవారు కాదు. అందుకే నేనెప్పుడూ అకౌంటును చూసుకుంటూ, ఒకళ్లని అడిగే అవసరం రాకుండా బ్యాంకు నుంచి లోన్ తెచ్చి అయినా సరే డబ్బులు ఉండేలా జాగ్రత్త పడేదాన్ని. ఆయన ఎవరికైనా ఇలా డబ్బు సాయం చేస్తున్నప్పుడు నేను ఏనాడూ అడ్డు చెప్పింది లేదు. నాకూ వాళ్ల అవసరం కళ్ల ముందు కనిపిస్తుంది మరి!
పండుగలంటే ఆయనకు చాలా ఇష్టం. దసరా, దీపావళి, క్రిస్మస్, రంజాన్… ఇలా ప్రతి పండుగనూ వేడుకగా చేసేవారు. ప్రతి వేడుకకూ నియోజకవర్గంలోని అయిదారు వేల మంది మహిళల్ని జమ చేసి, అందరితో కలిసి ఈ పండుగలు జరిపేవారు. చీర, కుక్కర్, పాన్సెట్… ఇలా ఒక్కోసారి ఒక్కోటిగా మహిళలకు ఉపయోగపడే సామగ్రిని గిఫ్ట్‌గా అందిస్తుండేవారు. మా నియోజకవర్గంలోని ప్రతి ఇంట్లో ఆయన ఇచ్చిన బహుమతులు కనీసం రెండు మూడు అయినా ఉంటాయి. ఆయనకు మహిళాభిమానులు ఎక్కువగా ఉండటానికి ఇది కూడా ఒక కారణం అనుకుంటా! ఒకసారి ఇక్కడి యువతకు అవసరం అనిపించి సుమారు 200 స్కూటీలు కూడా పంచారు.

మా ఇంట్లో అక్క, అన్న, నేను ఉన్నా… నాన్నతో కాస్త అజమాయిషీగా మాట్లాడేది నేనే. వేళకు తినరు, సక్రమంగా మందులూ వేసుకోరు. ఆ విషయంలో మాత్రం నేను చాలా గట్టిగా ఆయనతో పోట్లాడేదాన్ని. ఆయన తిండి, మందుల బాధ్యత నాదే. నాన్నంటే నాకు మంచి ఫ్రెండ్. కబుర్లు కూడా బాగా చెప్పేదాన్ని. పిల్లలందరం కూర్చుని ఏం చెప్పినా వింటూ ఉండేవారు. నాన్న నుంచి నేను చాలా నేర్చుకున్నా. ముఖ్యంగా స్నేహితుల్ని ఆయన చాలా ఇష్టపడేవారు. సొంత కుటుంబసభ్యులుగా భావించేవారు. మంచి ఫ్రెండ్స్‌ను చేసుకోండి అని మాకు కూడా చెబుతుండేవారు.
– దిశిర, కుమార్తె
పిల్లల పెంపకం విషయంలో ఆయన నాకే స్వేచ్ఛ ఇచ్చేవారు. నేను ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్ కూడా. తప్పు చేస్తే ఉపేక్షించేదాన్ని కాదు. మంచీ చెడూ చెప్పేదాన్ని. అలాగైతేనే రేపు జీవితంలో ఎదురయ్యే విభిన్నమైన వ్యక్తిత్వాల మనుషుల్ని, సమస్యలనీ సమర్థంగా ఎదుర్కోగలరు. ఆయన మాత్రం పిల్లల్ని గారాం చేసేవారు. చాలా ప్రేమగా చూసుకునేవారు. అయితే ఏదన్నా సందర్భంలో పిల్లలు అమ్మ తిట్టిందనో, మరొకటో చెబితే… ‘అమ్మ చెప్తే రైటే’ అని మాత్రం అనేవారు. పిల్లలని కాదు, నా విషయంలో నేను కూడా చాలా స్ట్రిక్టుగానే ఉంటా. బాధ్యత ఉండాల్సిందే అనుకుంటా. నేను కష్టాన్ని బాగా ఓర్చుకోగలనన్న కారణంతో అందరు మనవరాళ్లలోకీ మా తాతయ్య నన్నే ఎక్కువ ఇష్టపడేవారు. ‘ఇది మగాడిలా పుట్టాల్సింది’ అనేవారు. మావారు పోయాక నా చుట్టూ కమ్ముకున్న కష్టాలు, నిందల్లాంటివన్నీ తట్టుకుంటూ ఇవాళ కూడా ఇలా ముందుకు వెళుతున్నానంటే బహుశా ఆ స్వభావమే కారణం కావచ్చు.

నాన్నంటే నీకేం గుర్తొస్తుంది అని ఎవరన్నా అడిగితే నా లైఫ్ అని చెబుతా. ఎందుకంటే నాన్నంటేనే నా జీవితం. ఆయన ఇంట్లో అడుగు పెడుతూనే అక్షరా… అంటూ పిలుస్తూ లోపలికి వచ్చేవారు. పడుకున్నప్పుడు మధ్య మధ్యలో వచ్చి దుప్పటి సరిచేసి వెళుతుండేవారు. మాతో కలిసి సమయం గడపాలని మమ్మల్ని ట్రిప్పులకు తీసుకెళ్లేవారు. మరీ ముఖ్యంగా నేనంటే ఎంత సెంటిమెంట్ అంటే, ఓసారి ఆయన నామినేషన్ వేసేప్పుడు నేను సింగపూర్‌లో ఉన్నా. నేను ఎదురొస్తేనే ఆయన నామినేషన్ వేస్తారు. కేవలం దానికోసమే నన్ను సింగపూర్ నుంచి పిలిపించారు. ఆయన లేని లోటు మాకు ఎన్నటికీ తీరదు.
– అక్షర, కుమార్తె
ఈ సందర్భంలో నేను కేసీఆర్ గారి గురించి తప్పకుండా చెప్పాలి. మావారు చనిపోయిన రోజు ఆయన కళ్లలోనూ నీళ్లు చూశా. నన్ను ఓదారుస్తున్నప్పుడు మా నాన్న గుర్తొచ్చారు. మావారు కూడా ఎప్పుడూ కేసీఆర్‌ని పితృ సమానులుగానే భావించేవారు. ఆయన పోయాక కేసీఆర్‌గారు నన్ను బిడ్డలాగే ఆదరించారు. కేటీఆర్ అన్న అయితే అన్ని విషయాల్లో ప్రతి నిమిషం మాకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. మావారు పోయినా సరే పార్టీ క్యాడర్ కూడా నాకు ఇంత సపోర్ట్‌గా ఉండటం అన్నది నా బాధ్యతను పెంచుతున్నది. ఆయనలాగే నేను కూడా ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో ముందుండాలని అనుకుంటున్నా. ఒక్క మాట మాత్రం చెప్పగలను, ప్రజల్ని ఆయన తండ్రిలా పాలిస్తే, నేను తల్లిలా ఆదరిస్తా. నాడు నేడు సునీతమ్మ ఎప్పుడూ ప్రజల మనిషే!
– లక్ష్మీహరిత ఇంద్రగంటి
– సి.ఎం. ప్రవీణ్ కుమార్