కార్పొరేట్ ప్రపంచాన్ని బర్నౌట్ భయపెడుతున్నది. కార్యాలయాలు, పరిశ్రమలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఇదీ ఒకటిగా మారింది. దాదాపు అన్ని రంగాల్లోని ఉద్యోగుల్లో.. ఒత్తిడి పెరిగిపోయి, ఓపిక నశించి ఆసహనంలో కూరుకుపోయి ఆవేశానికి గురవుతున్నారు. ముఖ్యంగా.. జెన్-జీ, మిలీనియల్స్‌లో బర్నౌట్ ఎక్కువగా కనిపిస్తున్నది. ఫలితంగా, ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతున్నది.
మొన్నటి దాకా చిన్న సమస్యగా ఉన్న బర్నౌట్.. 2025లో రికార్డు స్థాయికి చేరుకుంది. ది ఇంటర్వ్యూ గైస్ ఇటీవల ఓ పరిశోధన మేరకు.. 2025లో ప్రపంచవ్యాప్తంగా 82 శాతం మంది ఉద్యోగులు బర్నౌట్ ప్రమాదంలో ఉన్నారని తేల్చింది. దీనివల్ల ఉద్యోగుల కష్టాలతో కార్పొరేట్ సంస్థలూ నష్టాల్లోకి జారిపోతున్నాయి. ఇక బర్నౌట్‌కు కారణాలు చూస్తే.. 52 శాతం మంది ఉద్యోగుల్లో పనిభారమే ప్రధాన సమస్యగా చెప్పుకొచ్చారు. 41 శాతం మంది తమకు సరైన మద్దతు లేకపోవడమని వాపోయారు. ఇక వయసును ప్రామాణికంగా చూసుకుంటే.. సగటు ఉద్యోగి 42 ఏళ్ల వయసులో తీవ్రమైన బర్నౌట్‌కు గురవుతున్నాడు. వీరితో పోలిస్తే.. యువతరం కెరీర్లో చాలా ముందుగానే దీర్ఘకాలిక అలసటను ఎదుర్కొంటున్నారని అధ్యయనం బయటపెట్టింది.
జెన్-జీ, మిలీనియల్ ఉద్యోగులు కేవలం 25 ఏళ్ల వయసులోనే బర్నౌట్ను అనుభవిస్తున్నారని తేల్చింది. ఆర్థిక ఒత్తిడి, విద్యార్థుల అప్పులు, అస్థిర ఉద్యోగ మార్కెట్లు.. ఈ పరిస్థితికి కారణమని తెలిసింది. బర్నౌట్లో లింగ అసమానతలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఎందుకంటే.. పురుషుల కంటే మహిళలే బర్నౌట్ అవుతున్నారు. పనిలో, ఇంట్లో గుర్తింపు లేకపోవడం, తక్కువ ప్రతిఫలం దక్కడం.. వీరి బర్నౌట్‌కు మూల కారణం. పెరుగుతున్న జీవన వ్యయం, అస్థిర కెరీర్ మార్గాలు కూడా బర్నౌట్‌కు దోహదం చేస్తున్నాయి. సోషల్ మీడియా.. అగ్నికి మరింత ఆజ్యం పోస్తున్నది.
అది రోజువారీ ఒత్తిడి నుండి కోలుకోవడాన్ని మరింత కష్టతరం చేస్తున్నది. ఏటా 1,20,000 మరణాలకు పని ఒత్తిడి దారితీస్తున్నదని అధ్యయనకారులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో బర్నౌట్ను వ్యక్తిగత బలహీనతగా పరిగణించొద్దనీ, దాన్ని ప్రజారోగ్య సంక్షోభంగా పరిగణించాలని సూచిస్తున్నారు. దీనిని నివారించడానికి కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలనీ, మూల కారణాలను పరిష్కరించాలని చెబుతున్నారు. సౌకర్యవంతమైన పని ఏర్పాట్లు, న్యాయమైన పనిభారాలు, గుర్తింపు, స్పష్టమైన కమ్యూనికేషన్ లాంటివి బర్నౌట్ రేట్లను గణనీయంగా తగ్గించగలవని అంటున్నారు.