బంజారాహిల్స్/జూబ్లీహిల్స్/షేక్‌పేట్/అమీర్‌పేట్, నవంబర్ 8: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార తుది గడువు సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయ పార్టీల ప్రచారం తారస్థాయికి చేరింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ శనివారం ఎర్రగడ్డ, షేక్‌పేట డివిజన్ల పరిధిలోని పలు కాలనీలు, బస్తీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధితో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అందజేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఎర్రగడ్డ డివిజన్లోని మైనారిటీ మహిళలు మాగంటి సునీతాగోపీనాథ్కు తమ మద్దతు తెలిపారు. షేక్‌పేట డివిజన్ పరిధిలోని ఫిల్మ్‌నగర్ బీజేఆర్నగర్, మహాత్మాగాంధీ నగర్ బస్తీల్లో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషాతో కలిసి మాగంటి సునీతాగోపీనాథ్ కుమారుడు వాత్సల్యానాథ్ ప్రచారం నిర్వహించారు. రహ్మత్‌నగర్‌లో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మాగంటి అక్షర, దిశిర ప్రచారం నిర్వహించారు.
అంతిమ విజయం బీఆర్ఎస్దే
జూబ్లీహిల్స్, నవంబర్ 8: కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ పార్టీదే అంతిమ విజయమని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం యూసుఫ్‌గూడ డివిజన్ కృష్ణానగర్‌లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించాచరు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభ్యున్నతికి నిరంతరం పాటుపడిన మాగంటి గోపినాథ్‌ను యాదిలో ఉంచుకుని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కారు గుర్తుకు ఓటు వేయండి
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో సంక్షేమం పూర్తిగా అటకెక్కిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం చేశారని పల్లా ఆరోపించారు. శనివారం ఎర్రగడ్డ డివిజన్ నటరాజ్‌నగర్, నేతాజీనగర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థ్ధి మాగంటి సునీతా గోపీనాథ్, ఆమె కుమారుడు వాత్సల్యానాథ్తో కలిసి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి మాగంటి సునీతా గోపీనాథ్‌ను బంపర్ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. తామంతా బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటామని వివిధ బస్తీల్లోని మహిళలు వారికి భరోసా ఇచ్చారు.
అమ్మను గెలిపించండి..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, తన తల్లి మాగంటి సునీతను గెలిపించాలని మాగంటి వాత్సల్యానాథ్ ఓటర్లను కోరారు. శనివారం షేక్‌పేట్‌లోని ఆనంద్‌విహార్, రెయిన్బో అపార్ట్మెంట్ గంగపుత్ర సంఘంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ప్రదీప్‌కుమార్, స్థానిక నాయకులు చెరక మహేష్ తదితరులతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వృద్ధులను ఆప్యాయంగా పలుకరించారు.