హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ నుంచి ఏపీకి అదనంగా మరో 2 టీఎంసీలను విడుదల చేసేందుకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ ఆమోదం తెలిపింది. అందుకు తెలంగాణ సైతం అంగీకరించింది. ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించిన అంశంపై త్రిసభ్య కమిటీ సమావేశం మెంబర్ సెక్రటరీ రాయపురే అధ్యక్షతన గురువారం కొనసాగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి ఇరు రాష్ర్టాలకు నీటి అవసరాలకు సంబంధించిన ఇండెంట్లను బోర్డుకు నివేదించారు. అప్పటికి అందుబాటులో ఉన్న జలాల్లో 35 టీఎంసీలను తెలంగాణకు, 45 టీఎంసీలను ఏపీకి గత అక్టోబర్లోనే కేటాయించిన సంగతి తెలిసిందే.
అయితే ఎగువన శ్రీశైలంలో నీటిని వినియోగించుకోలేకపోయామని చెప్పి ఇప్పటికే ఏపీ 5 టీఎంసీలను నాగార్జునసాగర్ నుంచి వినియోగించుకున్నది. తాజాగా అదేసాకుతో ఫిబ్రవరి నెలకు సంబంధించి నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా రోజుకు 1500 క్యూసెక్కుల చొప్పున, 15 రోజులపాటు మొత్తంగా అదనంగా మరో 2 టీఎంసీలను విడుదల చేయాలని ఏపీ ప్రతిపాదించింది. అదీగాక ఇప్పటికే కేటాయించిన జలాల్లో నుంచి మార్చి నెలకు సాగర్ కుడికాలువ ద్వారా 3 టీఎంసీలు, ఏప్రిల్కు సంబంధించి 5 టీఎంసీలను విడుదల చేయాలని ఏపీ కోరింది. అందుకు తెలంగాణ సైతం అంగీకారం తెలిపింది. ఇదిలా ఉంటే ఇప్పటికే కేటాయించిన జలాల్లో నుంచే ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్ తాగునీటి అవసరాలకు రోజుకు 6000 క్యూసెక్కుల చొప్పున ఎడమకాలువ ద్వారా మొత్తంగా 2 టీఎంసీలను విడుదల చేయాలని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ ప్రతిపాదించారు. దీంతో ఇరు రాష్ర్టాలకు నీటి విడుదలకు కేఆర్ఎంబీ అనుమతిచ్చింది. ఇరు రాష్ర్టాలు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించింది.