హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): ఆర్టీఏ కార్యాలయాల్లో, చెక్‌పోస్టుల్లో రోజురోజుకూ మితిమీరుతున్న అవినీతిపై ఇన్నాళ్లకు ఏసీబీ దృష్టిసారించింది. చెక్‌పోస్టుల్లో పనిచేసే సిబ్బందికి, సంబంధిత అధికారులకు ఉన్న అవినీతి లింకులపై ఆరా తీస్తున్నది. ఈ క్రమంతో గురువారం రాష్ట్రవ్యాప్తంగా పలు చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేపట్టిన ఏసీబీ బృందాలు.. శుక్రవారం ఆర్టీఏ అధికారుల బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేసింది.
ఇప్పటికే రవాణా శాఖలోని పలువురు అక్రమాధికారులు, ఉద్యోగుల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఏసీబీ.. యూపీఐ లావాదేవీలు, బ్యాంకుల్లోని నగదు వివరాలు, ఏజెంట్లతో చాటింగ్‌లను పరిశీలిస్తున్నది. గురువారం దాడుల్లో 10 మందికి పైగా అధికారులు, ఉద్యోగుల ఫోన్లను ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఉప్పల్ కార్యాలయంలో గురువారం అర్ధరాత్రి వరకు ఏసీబీ దాడులు కొనసాగాయి.