హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): దేశంలోనే సాగురంగంలో నవశకానికి తెలంగాణ నాంది పలికింది. అరుదైన నేలల సమాహారంగా, అన్నిరకాల పంటలకు అనువైన ప్రాంతంగా ఉన్న తెలంగాణను అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా ప్రభుత్వం తీర్చిదిద్దింది. పంట అమ్ముకోవడం దాకా అన్నదాతకు ప్రతి అడుగులో మార్గదర్శనంచేస్తూ.. ఎక్కడ ఏ పంట వేస్తే రైతు లాభాల బాట పడతారో సూచిస్తూ.. రైతులను సంపనం చేసింది. తెలంగాణలో ఏడేండ్ల క్రితం పరిస్థితి వేరు. ఇప్పుడు వ్యవసాయం పరిస్థితి వేరు. ప్రభుత్వం వ్యవసాయరంగానికి సంబంధించి ఒక్కో సమస్యను పరిష్కరించుకొంటూ వస్తున్నది. సాగునీటి గండం తప్పింది. కరెంటు కష్టం తీరింది. ఉచితంగా కరెంట్ వస్తున్నది. పంటకు పెట్టుబడి సాయమూ ప్రభుత్వమే ఇస్తున్నది. రైతు కుటుంబానికి బీమాతో బతుకు భరోసానిస్తున్నది. పండిన పంటను తానే కొంటున్నది. రైతు కేంద్రీకృత పథకాలతో రాష్ట్ర వ్యవసాయరంగ దశ దిశను సీఎం కేసీఆర్ మార్చేశారు.
రుణమాఫీ కింద ఇప్పటి వరకు 41 లక్షల మంది రైతులకు రూ.17 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది.
రాష్ట్రంలో రూ.572.88 కోట్లతో 2,601 రైతు వేదికలను నిర్మించింది.
రైతులు పండిస్తున్న ప్రతి గింజను కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. ప్రతి రైతుకు కచ్చితంగా మద్దతు ధర దక్కేలా చూసింది. కరోనాలో రైతులకు ఇబ్బంది కలుగకుండా ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే.