Telangana | హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : మూడు లక్షల కోట్ల బడ్జెట్. ఈ మూడు లక్షల కోట్లల్లో విద్యారంగం వాటా 23వేల కోట్లు. సర్కారు బడుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పాఠాలు. 15వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు. ఇది సర్కారు వారు డబ్బా. ఇది ఒక పార్శమైతే. మరో పార్శంలో రాష్ట్రంలోని 4,740 సర్కారు బడుల్లో టాయిలెట్లు లేవు. మరీ ముఖ్యంగా 1,704 స్కూళ్లల్లో బాలికలకు టాయిలెట్ వసతి లేదు. ఇంతటి అధ్వాన పరిస్థితులు రాష్ట్రంలోని సర్కారు బడుల్లో నెలకొన్నాయి.
ఈ బడుల్లో ఒంటికి.. రెంటికి పోవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం సమస్యగా మారింది. విద్యాశాఖ లెక్కల ప్రకారం.. ప్రతి 80 మంది విద్యార్థులకు ఒక టాయిలెట్ చొప్పున ఉండాలి. కానీ 18.58శాతం పాఠశాలల్లో బాలురకు టాయిలెట్లు లేవు. మరో 6.75శాతం పాఠశాలల్లో బాలికల టాయిలెట్లు లేకపోవడం ఆందోళనకరం. బడుల్లో బాలికలు టాయిలెట్లు లేని కారణంగా మంచినీళ్లు కూడా తాగడం మానేస్తున్నారు. దీంతో అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు. తగినంత నీళ్లు తాగకపోవడంతో, మూత్రపిండాల ఇన్ఫెక్షన్సహా ఇతర రోగాల పాలవుతున్నారు.