Telangana | హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): సంక్షేమ పథకాల రూపకల్పన, అమలులో తెలంగాణ రాష్ట్రం రోల్‌మాడల్‌గా నిలుస్తున్నది. ఇప్పటికే కేంద్రప్రభుత్వంతోపాటు, అనేక రాష్ర్టాలు తెలంగాణ పథకాలను కాపీ కొట్టి పేర్లు మార్చి అమలు చేసుకొంటున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం నుంచి సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు అనేక విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుడుతూ సబ్బండ వర్గాల సంక్షేమానికి కొత్త బాటలు వేస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, లింగమార్పిడి వ్యక్తులు, అనాథలు, చేతివృత్తిదారులు, కులవృత్తిదారుల.. ఒకరేమిటి ప్రభుత్వం సబ్బండ వర్గాలకు సంపదలో సమ వాటా పంచుతున్నది.
అట్టడుగువర్గాలకు అభివృద్ధి ఫలాలను అందిస్తూ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నది. ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, గురుకుల విద్యాలయాలు, ఉచిత విద్యుత్తు, గొర్ల పంపిణీ, చేపల పంపిణీ, దళితబంధు వంటి ఎన్నో సంక్షేమ పథకాలతో తెలంగాణ వర్ణ శోభితమై విరాజిల్లుతున్నది. అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి పేదల సంక్షేమానికి ఏకంగా రూ.2.29 లక్షల కోట్లకుపైగా నిధులను వెచ్చించడం విశేషం.
సంతోషాల వెల్లువ
తెలంగాణ ప్రభుత్వం వినూత్నరీతిలో పథకాలను రూపకల్పన చేయడమే కాదు.. వాటి అమలులోనూ వినూత్న పంథాను అనుసరిస్తున్నది. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌తోపాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ తదితర అనేక రాష్ర్టాలు సామాజిక పెన్షన్ల పథకానికి అర్హుల ఎంపికలో అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. చాలా రాష్ర్టాల్లో గ్రామీణ ప్రాంతాల్లో రూ.60 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.75 వేల వార్షికాదాయం మించితే పెన్షన్ పథకానికి అనర్హులుగా ప్రకటిస్తున్నారు. వయస్సు, ఇతరత్రా అనేకాంశాల్లో సవాలక్ష పరిమితులు విధించారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ప్రతి అంశంలోనూ ఉదారంగా వ్యవహరిస్తూ మానవీయతను చాటుకొంటున్నది. వీలైనంత ఎక్కువ సంఖ్యలో పేదలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తున్నది. పెన్షన్ పథకానికి రాష్ట్రంలో వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు ఉండటమే అందుకు ఉదాహరణ. ఇతర రాష్ర్టాలతో పోల్చితే ఇది డబుల్. అంతేకాదు లబ్ధిదారుల ఎంపిక, నిధుల మంజూరులో ఎక్కడా దళారులకు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా, నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోనే డబ్బు జమచేస్తుండటం విశేషం.
దశాబ్ది వేడుకల్లో నేడు సంక్షేమ సంబురాలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ సంబురాలను నిర్వహించనున్నారు. రాష్ట్ర సాంఘిక, వెనకబడిన తరగతులు, గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగనున్నాయి. హైదరాబాద్‌లోని వేదికగా రవీంద్రభారతిలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్రస్థాయి వేడుకలు నిర్వహిస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా స్టాల్స్‌ను ఏర్పాటు చేయడంతోపాటు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. శాఖలవారీగా సాధించిన ప్రగతిపై డాక్యుమెంటరీలను ప్రదర్శిస్తారు. లబ్ధిదారుల విజయగాథలను వివరిస్తారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సత్యవతిరాథోడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్ ముఖ్యఅతిథులుగా హాజరుకానుండగా, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.