కామారెడ్డి: ఈ నేలపై తాను బతికున్నంత వరకు తెలంగాణ సెక్యులర్ రాష్ట్రంగానే ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన సభకు వచ్చిన ముస్లింలను ఉద్దేశించి ఉర్దూలో ప్రసంగించారు. అల్లా దయతో తెలంగాణ వచ్చిందన్నారు. బీఆర్ఎస్ కంటే ముందు పదేళ్ల కాంగ్రెస్ పాలనలో మైనార్టీల అభివృద్ధి కోసం కేవలం రూ.900 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, తాము గడిచిన పదేళ్లలో రూ.12 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం చెప్పారు.
కామారెడ్డిలోని ముస్లింలు అందరికీ సలాం చేస్తున్నానని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడుతున్న సమయంలో అనేకసార్లు కామారెడ్డికి వచ్చి సభలు నిర్వహించానని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మనం చేస్తున్న పోరాటంలో నిజాయితీ ఉన్నది. ధర్మం ఉన్నది. కాబట్టి ఈ పోరాటంలో తప్పక విజయం సాధిస్తాం’ అని ఇక్కడ ప్రజలు ఆశీర్వదించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘అల్లా కే ఘర్ మే ధేర్ హో సక్తా, లేకిన్.. అంధేర్ నహీ’ అని పేర్కొన్నారు. అల్లా దయతో తెలంగాణ వచ్చిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామాన్ని, ప్రతి ప్రాంతాన్ని, ప్రతి సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేశామని చెప్పారు.
‘తెలంగాణ ఏర్పాటుకుకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. పదేండ్లలో వాళ్లు మైనార్టీల అభివృద్ధి కోసం రూ.900 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కానీ మేము ఈ పదేండ్లలోనే రూ.12 వేల కోట్లు ఖర్చు చేశాం. దీనిని బట్టే ఎవరికి మైనార్టీల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్నదో ఆలోచించాలి’ అని సీఎం కోరారు. మైనార్టీల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశామని చెప్పారు. అక్కడ వారికి మంచి చదువు అందుతున్నదని, ఎంతో మంది డాక్టర్లు, ఇంజినీర్లు తయారవుతున్నారని చెప్పారు. ఇలాంటి సదుపాయం అంతకుముందు లేదన్నారు. తాను బతికున్నంత వరకు తెలంగాణ సెక్యులర్‌గా ఉంటుందని చెప్పారు. మైనార్టీలంతా బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని, కారు గుర్తుకే ఓటేయాలని, మరోసారి విజయం అందించాలని సీఎం కోరారు.