హైదరాబాద్, జూన్6 (నమస్తే తెలంగాణ): గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ బీజేపీ నేతలు స్పందించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ జల హకులను కాపాడాలని వారిని కోరా రు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
ఏపీ ప్రభుత్వం ట్రిబ్యునల్ అవార్డులకు విరుద్ధంగా గోదావరిపై బనకచర్ల ప్రాజెక్టును చేపడుతున్నదని విమర్శించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలను తెలుపుతూ కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిందని వెల్లడించారు.
ఏపీ ప్రభుత్వం మాత్రం దూకుడుగా ముందుకుపోతున్నదని, కేంద్రం సైతం సహకరిస్తున్నట్టుగా ఉన్నదని అనుమానం వ్యక్తంచేశారు. అవార్డులకు, చట్టాలకు వ్యతిరేక చర్యలను కేంద్రం నివారిస్తుందని తాము ఇప్పటికీ విశ్వసిస్తున్నామని, అలాకాకుండా రాష్ట్ర జలహకుల రక్షణ కోసం తాము ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.