నల్లగొండ ప్రతినిధి, జూన్ 11 (నమస్తే తెలంగాణ): వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉపఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పైసల పంపిణీ నల్లగొండ కాంగ్రెస్‌ను కుదిపేస్తున్నది. ఎన్నికల్లో నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఒక్క రోజు కూడా ప్రచారానికి రాలేదు. పైగా తమకు సంబంధం లేదన్నట్టుగా కామెంట్స్ చేశారు. దాంతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న తనకు సన్నిహితుడైన నల్లగొండలో రైట్ పాలిటిక్స్ పేరుతో యూట్యూబ్ చానల్ నడిపే ఎలికట్టె శంకర్రావు సాయం తీసుకున్నాడు. ఆయన ద్వారా స్థానిక లీడర్లకు రూ.లక్ష నుంచి రెండు లక్షలు పంపిణీ జరిగేలా చూడాలని మల్లన్న తన అనుచరులను ఆదేశించారు. దాంతో పోలింగ్‌కు ముందు రూ.40లక్షలు మల్లన్న అనుచరులు శంకర్రావుకు తెచ్చి ఇచ్చినట్టు తెలిసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి తెలియకుండానే పలువురు కౌన్సిలర్లు, నేతలకు యూట్యూబర్ కొంత డబ్బును పంపిణీ చేసినట్టు సమాచారం. కొందరికి డబ్బులు రావడం, మరికొందరికి రాకపోవడంతో ఆ పార్టీలోనే పోలింగ్ సందర్భంగా రచ్చ మొదలైంది. కొందరు కాంగ్రెస్ కౌన్సిలర్లు నేరుగా తీన్మార్ మల్లన్నను ఈ డబ్బుల పంపిణీపై ప్రశ్నించినట్టు తెలిసింది.
రంగంలోకి దిగిన ఆయన అనుచరులు తాము ఇచ్చిన డబ్బులు ఎవరెవరికీ ఇచ్చావో ఒక జాబితా ఇవ్వాలని శంకర్రావుపై ఒత్తిడి తెచ్చారు. వీళ్లు చేసిన ఒత్తిడితో ఓ జాబితా బయటకు వచ్చింది. ఈ జాబితాలో పేర్లున్న వారిలో చాలా మంది తమకు అసలు డబ్బే రాలేదని ఆగ్రహం వ్యక్తం చేయడం వివాదాస్పదంగా మారింది. దాంతో తీన్మార్ మల్లన్న అనుచరులు తమ డబ్బు వాపస్ చేయాలని శంకర్రావుపై ఒత్తిడి తెచ్చారు. పలుమార్లు ఇంటికి వెళ్లి బెదిరించినట్టు తెలిసింది. ఇదే సమయంలో జాబితాలో పేర్లు ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్లు తమకు డబ్బు ఇవ్వకుండానే బదనాం చేస్తున్న శంకర్రావుపై చర్యలు తీసుకోవాలని నల్లగొండ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు శంకర్రావును విచారణకు పోలీసుస్టేషన్‌కు పిలిపించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు తీన్మార్ మల్లన్న అనుచరులు కూడా స్టేషన్‌కు చేరుకున్నారు.
నల్లగొండ టూటౌన్ పీఎస్‌లో సోమవారం పైసల పంచాయితీ సెటిల్మెంట్ అయినట్టు తెలిసింది. స్టేషన్లో ఈ పంచాయితీ జరుగుతున్న సమయంలో చిత్రీకరించిన వీడియాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. వీడియో క్లిప్పుల్లో…తాము అందజేసిన రూ.40లక్షల గురించి శంకర్రావును తీన్మార్ మల్లన్న అనుచరులు ప్రశ్నిస్తున్నట్టుగా దృశ్యాలు ఉన్నాయి. ఇదే సమయంలో పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్లు తమకు డబ్బులు ఎక్కడ ఇచ్చావో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా వీడియోల్లో వెల్లడైంది. ఇరువర్గాలు వాదోపవాదనలు చేసుకుంటుండడంతో పోలీసులు వీరిని బయటకు పంపించినట్టు తెలిసింది. ఈ వివాదం మరింత రచ్చకు దారి తీయకుండా మున్సిపల్ చైర్మన్, మరో నేత ప్రవేశించి పంచాయితీని కొలిక్కి తెచ్చినట్టు సమాచారం. చివరకు పంచకుండా మిగిలిన డబ్బును త్వరలోనే సర్దుబాటు చేస్తానని శంకర్రావు ఒప్పుకోవడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగినట్టు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది. ఎన్నికల్లో పంపిణీ కోసం డబ్బును అందజేయడమే నేరం కాగా ఏకంగా తాము ఇచ్చిన డబ్బు పంచలేదని తీన్మార్ మల్లన్న అనుచరులు రచ్చకెక్కడం కలకలం రేపుతున్నది.