కోహెడ, అక్టోబర్ 18: మావోయిష్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కాతా రాంచంద్రారెడ్డి అంత్యక్రియలు శనివారం ఆయన స్వగ్రామం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లిలో ముగిశాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అబూజ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో రాంచంద్రారెడ్డి మృతిచెందారు. కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించగా మృతదేహం స్వగ్రామానికి చేరింది.
పౌరహక్కుల సంఘాల నేతలు, దేశపతి శ్రీనివాస్, నందిని సిధారెడ్డి తదితరులు రాంచంద్రారెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బూటకపు ఎన్కౌంటర్లతో ఉద్యమాన్ని ఆపలేరని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను అంతం చేయడానికి పూనుకోవడం నీచమైన చర్య అని మండిపడ్డారు. ఇంద్రావతిలో పారేది నీళ్లుకాదని, విప్లవకారుల రక్తం అని తెలిపారు.