Operation Musi | హైదరాబాద్ సిటీబ్యూరో/ఎల్బీనగర్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : మూసీ ఆపరేషనల్ నిర్వాసితుల్లో దడ పుట్టిస్తున్నది. తహసీల్దార్ల బృందం మూసీ పరీవాహక ప్రాంతాల్లో సంచరిస్తూ నిర్వాసితులను ఒప్పించే యత్నం చేస్తున్నది. ఆ బృందాలను చూస్తేనే అక్కడి జనం వణికిపోతున్నారు. విడదసీ.. తరలించు అన్నట్టుగా ఒక్కో బృందం కొన్ని కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని వారిని ఖాళీ చేయించే చర్యలకు పాల్పడుతున్నది. శుక్రవారం సైదాబాద్, నాంపల్లి, ఉప్పల్, నాగోల్ ప్రాంతాల్లో అధికారులు నిర్వాసితులతో చర్చించారు. తమంతట తాము ఖాళీ చేస్తే రూ.25 వేల పారితోషకం ఇస్తామంటూ ఆశ చూపించారు. కానీ చాలామంది తమ గూడును వదలడానికి అంగీకరించలేదు. కొంతమంది పెద్ద దిక్కులేని వాళ్లు భయంగానే అంగీకరించినట్టు చెప్తున్నారు. సైదాబాద్‌లో 32 కుటుంబాలను ఉప్పల్‌లోని ప్రతాప సింగారం డబుల్ బెడ్రూం ఇండ్లకు తరలించినట్టు అధికారులు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని, మూసీ పరీవాహకంలోని తమ ఇండ్లజోలికి రాకుండా చూడాలంటూ కొంతమంది మూసీ నిర్వాసితులు ఫణిగిరికాలనీ వెంకటసాయినగర్లోని సాయి సన్నిధి ఆలయంలో సాయిబాబాకు వినతి పత్రం అందజేశారు.
పండుగ పూట ఏడ్చినం
‘డబ్బులు పెట్టి జాగాలు కొనుక్కొని ఇండ్లు కట్టుకున్నం. మాది అక్రమ నిర్మాణం అంటే చెప్పుతో కొడతాం. ఎవడొస్తడో రమ్మను రేవంత్‌రెడ్డి. నిన్న, ఇయ్యాల వచ్చి మా ఇండ్లు కూల్చివేస్తానంటే ఎలా? ఇక్కడి నుంచి పోయి ఎక్కడో చెత్త కుప్ప ప్రాంతంలో ఉండాలంటే ఎందుకు పోతాం? మా బాధలు ఏం చూసిండు రేవంత్‌రెడ్డి? మా వద్దకు రమ్మను. ఇండ్ల కూల్చివేతను మానుకుంటేనే మంచిది. లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. సీఎం సీటు నుంచే దింపేస్తం. మా ఇండ్లలో మేమే ఉంటాం. కొత్తపేటలోని పట్టాదారుల నుంచి కొనుగోలు చేశాం. మేం 35 ఏండ్ల క్రితం స్థలాలు కొని కట్టుకున్నాం. సీఎం పదవిలో ఉండి తాను ఏం మాట్లాడినా నడుస్తది అని రేవంత్‌రెడ్డి అనుకుంటే ఎట్లా? ఇల్లు పోతుందనే బాధతో ఏడ్చుకుంటూ బతుకమ్మను ఆడినం. అందుకే రేవంత్‌కు వ్యతిరేకంగా పాట పాడినం. మేం ఒక్కరం కాదు.. హైదరాబాద్ మొత్తం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నది. పాట పాడుతున్నది.
– ఓ మహిళ ఆక్రందన