హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ): చారిత్రక నేపథ్యానికి ఆధునికత మేళవింపే టీ హబ్ 2.0 భవన నిర్మాణం. హైదరాబాద్ అంటే ఎవరికైనా చార్మినారే గుర్తొస్తుంది. అలాంటి కట్టడాన్ని స్ఫూర్తిగా తీసుకొని అత్యాధునిక శైలిలో నిర్మించిన ఈ భవనం అందరినీ అబ్బురపరుస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా మంగళవారం టీహబ్-2 నూతన భవనం ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో భవనం ఫొటోలను పోస్టు చేయగానే పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. నిర్మాణం అద్భుతంగా ఉన్నదంటూ కితాబిచ్చారు. ‘ఆ రూట్లో వెళ్తున్నప్పుడు భవనాన్ని చూసి వావ్ అనిపించింది. ఆకర్షణీయంగా ఉన్న ఆ నిర్మాణాన్ని దగ్గరినుంచి చూసేందుకు కారుని రివర్స్ చేసుకున్నాను.
అది టీహబ్ కొత్త బిల్డింగ్ అని తెలిసింది. మారుతున్న తెలంగాణకు ఇది ఓ ఉదాహరణ’ అని క్రీడాకారుడు గగన్ నారంగ్ ప్రశంసించారు. ఐటీ కారిడార్‌లో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన టీహబ్ కొత్త భవనం ఇంజినీరింగ్ అద్భుతానికి తక్కువేమీ కాదు. చార్మినార్ తరహాలోనే ఈ భవనం కూడా నాలుగు పిల్లర్ల మీదే నిర్మాణం పూర్తిచేసుకున్నది. చార్మినార్‌లోని పిల్లర్ల మధ్య నుంచి పైకి వెళ్లినట్లే ఇందులోనూ మెట్ల మార్గాలు, లిప్టులను ఏర్పాటు చేశారు. నలుదిక్కులా గాలి, వెలుతురు వచ్చేలా నిర్మాణం చేపట్టి.. బయటి భాగాన్ని పూర్తిగా కవర్ చేస్తూ ఇనుప జాలీని ఏర్పాటు చేశారు. మొత్తం 10 అంతస్థులున్న భవానాన్ని 5 అంతస్థులకు ఒక భాగం, మరో 5 అంతస్థులకు మరో భాగంగా విడదీసి మధ్య భాగాన్ని పిల్లర్ల చుట్టూ డిజైన్‌తో నిర్మించారు.
నాలుగు పిల్లర్ల మధ్య భాగాలను సాగదీసి..
టీహబ్ భవనాన్ని సాంప్రదాయ నిర్మాణ శైలిలో కాకుండా పూర్తిగా భిన్నమైన, ఎంతో ఆధునికమైన విధానంలో చేపట్టారు. ఈ భవనం కోసం మొత్తం 10వేల మెట్రిక్ టన్నుల స్టీల్‌ను వినియోగించారు. చార్మినార్‌కు ఉన్నట్లుగా మొదట నాలుగు పిల్లర్లను నిర్మించి సుమారు రెండతస్థుల ఎత్తుకు వెళ్లిన తర్వాత నాలుగు పిల్లర్ల మధ్య భాగాలను రెండు వైపులా ఎక్కువ దూరం, మరో రెండు వైపులా తక్కువ దూరం ఉండేలా నిర్మించారు. ఇలా ఐదు అంతస్థులు నిర్మించిన తర్వాత మళ్లీ నాలుగు పిల్లర్ల మీద కొంత ఎత్తు వరకు నిర్మాణం పూర్తిచేసి, వాటి మీద మళ్లీ ఐదు అంతస్థులతో భవనాన్ని పూర్తిచేశారు. మొత్తం 5 లక్షలకు పైగా చదరపు అడుగుల నిర్మాణ స్థలం ఉండగా.. అందులో 3.5 లక్షల చదరపు అడుగులను మాత్రమే వినియోగించేలా డిజైన్ చేసి అత్యాధునిక శైలితో కూడిన ఇంటీరియర్స్‌ను ఏర్పాటు చేశారు.
ఐకానిక్‌గా ఉండేలా నిర్మాణం
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఒక ఐకానిక్ నిర్మాణంలా టీ హబ్ భవనం ఉండేలా తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో డిజైన్ పోటీలను నిర్వహించింది. కొరియన్ సంస్థ స్పేస్ గ్రూపుతో కలిసి మా కంపెనీ ‘ఫామ్ స్టూడియో’ ఈ డిజైన్లను రూపొందించింది. దీని నిర్మాణంలో 10వేల మెట్రిక్ టన్నుల స్టీల్‌ను వాడాము. మొత్తం 64 రకాల లోడింగ్ టెస్టులను నిర్వహించాం. మొత్తం ఖాళీగా ఉంటే ఎలా ఉంటుంది..? ఒకవైపే ఉద్యోగులు ఉంటే ఎలా ఉంటుంది..? ఇలా రకరకాల పరీక్షలు నిర్వహించారు. ఐఐటీ చెన్నై, ఐఐటీ రూర్కీ వంటి సంస్థలు దీని నిర్మాణంపై అధ్యయనం చేసి నివేదికలు ఇచ్చాయి. అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టీల్ సంస్థ సైతం దీని నిర్మాణంపై సూచనలు చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇంటీరియర్స్‌ను ఏర్పాటు చేశాం.
–ఆర్కిటెక్ట్ రవికిరణ్ బుసి