హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ‘మాది ప్రజాప్రభుత్వం. ప్రజలు ఎప్పుడొచ్చినా మా తలుపులు తెరిచే ఉం టాయి’.. సీఎం రేవంత్‌రెడ్డి తరుచూ చెప్పే మాటలివి. ఆచరణలో మాత్రం ఇవి అటకెక్కేశాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా సీఎం దర్శనం దుర్లభంగా మారింది. రేవంత్ ఇంటి వద్ద టీచర్లు పడిగాపులు కాసినా వృథా ప్రయాసే అయింది. ఉపాధ్యాయుల పదోన్నతుల్లో తమకు జరుగుతున్న అన్యాయాన్ని సవరించాలని కోరుతూ సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ (ఎస్జీటీయూ) చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చింది. పలు జిల్లాలకు చెందిన ఎస్జీటీలు ఉదయాన్నే సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి తరలివచ్చారు. పెద్దమ్మగుడి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో సమావేశమయ్యారు. పోలీసుల ఆంక్షల కారణంగా వారికి సీఎంను కలిసే అవకాశం లభించలేదు. సీఎంను కలిశాకే తాము వెనుదిరుగుతామని భీష్మించడంతో చివరికి ఐదుగురు ప్రతినిధులను ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సీఎం నివాసంలోకి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి పిలిచారు కాబట్టి తమ సమస్యలు పరిష్కారమవుతాయని భావించిన వారికి అక్కడికెళ్లాక మరోమారు నిరాశే ఎదురైంది. చాలాసేపు వేచి చూసిన తర్వాత సీఎం బిజీగా ఉన్నారని, ప్రస్తుతం కలవడం సాధ్యం కాదని చెప్పడంతో చేసేది లేక రేవంత్‌రెడ్డి వ్యక్తిగత కార్యదర్శికి వినతిపత్రం ఇచ్చి వెనుదిరగాల్సి వచ్చింది.
10 వేల పీఎస్ హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలి
రాష్ట్రంలో 60వేల మంది సెకండరీ గ్రేడ్ టీచర్లున్నారు. 29 ఏండ్ల నుంచి ఎస్జీటీలుగా పనిచేస్తున్నా పదోన్నతులు లేవు. 1 నుంచి 5 తరగతులకు బోధించేందుకు సరిపడా టీచర్లను నియమించాలి. గత ప్రభుత్వం 10 వేల ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయ (పీఎస్ హెచ్ఎం) పోస్టులు ప్రకటించింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ పో స్టులను మంజూరు చేస్తూ బీఎడ్, డీఎడ్ అర్హత గల వారికి కామన్ సీనియార్టీ ప్రకా రం పదోన్నతులు ఇవ్వాలి. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టుల్లోనూ కామన్ సీనియార్టీ ఇవ్వాలి. ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్ హోదా కల్పించాలి. ఎస్జీటీలకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి. స్కూళ్లల్లో పారిశుధ్య నిర్వహణకు సర్వీస్ పర్సన్స్‌ను నియమించాలి.
– కరివేద మహిపాల్‌రెడ్డి, ఎస్జీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు