జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్23 (నమస్తే తెలంగాణ): భూపాలపల్లిలో ఓ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తల్లిదండ్రుల ఫిర్యాదుపై గురువారం జై భజరంగ్‌దళ్ జిల్లా ఇన్చార్జి శ్యామ్ తమ కార్యకర్తలతో పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులను చితక్కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థినుల ఫిర్యాదుతో ఇద్దరు ఉపాధ్యాయులపై పోలీసులకు కేసు నమోదు చేశారు. భజరంగ్‌దళ్ కార్యకర్తలు అకారణంగా పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులపై దాడి చేశారని ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో జరిగిన ఘటనపై విచారణ జరుపుతున్నామని విద్యాశాఖ అధికారి రాజేందర్ చెప్పారు.
తాండూరు రూరల్, అక్టోబర్ 23 : వికారాబాద్ జిల్లాలో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడిపై పొక్సో కేసు నమోదయింది. తాండూరు జడ్పీహెచ్ఎస్ విద్యార్థిని పట్ల సైన్స్ టీచర్ రాఘవేందర్‌రెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు కరన్‌కోట్ ఇన్చార్జి ఎస్సై విఠల్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.