హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల కార్యక్రమాన్ని కొడంగల్‌కు మార్చి సీఎం రేవంత్‌రెడ్డి ఉపాధ్యాయులను అవమానించారని టీజీపీఎస్సీ మాజీ మెంబర్ సుమిత్రా ఆనంద్ మండిపడ్డారు. శనివారం తెలంగాణభవన్‌లో రిటైర్డ్ టీచర్ జగదీశ్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. టీచర్ల సమస్యలు పరిష్కరించడం చేతగాని ఆయన కేసీఆర్‌పై నెపం నెట్టి తప్పించుకుంటున్నారని దుయ్యబట్టారు. అబద్ధాలాడి, అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి పాలనలోనూ అదే పరంపర కొనసాగిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఉపాధ్యాయులకిచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో వారు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు.
టీచర్లకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేందుకు వెయ్యి రోజుల సమయం సరిపోదా? ఇంకా రెండేళ్ల సమయం కావాలా? అని ప్రశ్నించారు. మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో విద్యారంగానికి ఒరిగింది శూన్యమని విరుచుకుపడ్డారు. పీఆర్సీ, డీఏలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మూడేండ్లలో చేసిన పనులకు వేయాల్సింది సున్నా మార్కులేనని దెప్పిపొడిచారు. పిల్లలకు నాణ్యమైన భోజనం కూడా పెట్టడం చేతగాని అసమర్థ సర్కారు అని దుమ్మెత్తిపోశారు. ఇంజినీర్లను క్రిమినల్ వేస్ట్ అని వారికి చదువు చెప్పిన గురువులను అగౌరవపరిచారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న రేవంత్ సోయి తెచ్చుకొని తన శాఖపై దృష్టిపెట్టాలని హితవుపలికారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి వద్ద విద్యాశాఖ ఉండటంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు అంతా మంచి జరుగుతుందని ఆశించారని ఎస్టీయూ మాజీ అధ్యక్షుడు భుజంగరావు పేర్కొన్నారు. కానీ మూడేండ్లలో ఆయన తీరు చూసిన తర్వాత ఆశలు సన్నగిల్లాయని స్పష్టంచేశారు. విద్యారంగం బాగు దేవుడెరుగు.. మూడు వేలకుపైగా స్కూళ్ల మూసివేతకు కారణమయ్యారని మండిపడ్డారు. ముక్త్ రేవంత్‌తోనే విద్యారంగం బాగుపడుతుందని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి విద్యాశాఖను వదిలిపెట్టి పాలనపై దృష్టిపెట్టాలని హితవు పలికారు.