హర్మన్‌ప్రీత్ కౌర్ సేన సత్తాచాటడంతో ఆసియా క్రీడల తాజా ఎడిషన్‌లో భారత్ స్వర్ణ కాంక్ష తీరింది. తొలి రెండ్రోజుల పాటు షూటర్లు రజత మెరుపులు మెరిపించగా.. ఒకరిద్దరు పసిడికి చేరువగా వచ్చినా దక్కని బంగారం.. అమ్మాయిల ఆటకు ఫిదా అయి వారి చెంతకు చేరింది. రెండు రోజులూ పతక గురి పెట్టిన షూటర్లకు మూడో రోజు నిరాశే ఎదురైంది. వుషూతో పాటు బ్యాడ్మింటన్‌లో అబ్బాయిల జట్టు సెమీస్ చేరి పతకం ఖాయం చేసుకోగా అమ్మాయిలు క్వార్టర్స్‌లోనే నిష్క్రమించారు. హాకీలో భారత జైత్రయాత్ర కొనసాగుతుండగా టేబుల్ టెన్నిస్ జట్ల కథ క్వార్టర్స్‌లోనే ముగిసింది.
నగోయా: భారత మహిళల క్రికెట్ జట్టు ఆసియా క్రీడల్లో దేశానికి తొలి పసిడి పతకాన్ని అందించింది. గత ఎడిషన్‌లోనూ స్వర్ణం గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన మరోసారి అదే ప్రదర్శనను పునరావృతం చేస్తూ ఫైనల్లో శ్రీలంకపై భారీ విజయం సాధించి వరుసగా రెండో పసిడి పతకాన్ని ముద్దాడింది. నిషిన్ వేదికగా జరిగిన ఫైనల్లో ఉమెన్ ఇన్ బ్లూ.. 147 పరుగుల తేడాతో లంకను ఓడించి ఆసియాడ్‌లో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించింది. లంకకు రజతం దక్కగా కాంస్యం కోసం జరిగిన పోరులో పాకిస్థాన్.. బంగ్లాదేశ్‌పై 31 పరుగుల తేడాతో గెలిచి పతకాన్ని నెగ్గింది.
మంధాన, రిచా ధనాధన్

Smriti
ఫైనల్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. స్మృతి మంధాన (45 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 79), రిచా ఘోష్ (22 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49 నాటౌట్), ఓపెనర్ షెఫాలీ వర్మ (29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48) ధనాధన్ ఆటతో నిర్ణీత 20 ఓవర్లకు 3 వికెట్లే కోల్పోయి 216 పరుగుల రికార్డు స్కోరు చేసింది. ఓపెనర్లు షెఫాలీ, స్మృతి పది ఓవర్లలోనే తొలి వికెట్‌కు 99 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. 30 బంతుల్లోనే ఫిఫ్టీ బాదిన మంధాన తన కెరీర్లో 37వ అర్ధ శతకాన్ని పూర్తిచేసింది. తద్వారా ఆమె మహిళల క్రికెట్లో 11 వేల పరుగుల మార్కును అధిగమించిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కింది. షెఫాలీ, స్మృతి నిష్క్రమించినా ఆఖర్లో రిచా ఫోర్లు, సిక్స్‌లతో రెచ్చిపోయి భారత్‌కు భారీ స్కోరును అందించింది. లక్ష్యఛేదనలో లంక 15.4 ఓవర్లు ఆడి 69 పరుగులకే ఆలౌట్ అయింది. దీప్తి శర్మ (3/6), శ్రేయాంక (2/9), శ్రీచరణి (2/13), షెఫాలీ వర్మ (2/3) స్పిన్ మాయకు ఆ జట్టు కుదేలైంది. కెప్టెన్ చమారి ఆటపట్టు (29) టాప్ స్కోరర్.
అబ్బాయిలకు పతకం ఖాయం
అమ్మాయిలు ఔట్

Lakshya
బ్యాడ్మింటన్‌లో భారత పురుషుల జట్టు సెమీస్ చేరి దేశానికి మరో పతకాన్ని ఖాయం చేసింది. గత ఎడిషన్‌లో రజతం గెలిచిన అబ్బాయిలు.. తాజాగా క్వార్టర్స్‌లో 3-0తో జపాన్‌పై గెలిచి సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. లక్ష్యసేన్, సాత్విక్-చిరాగ్ ద్వయంతో పాటు అయూశ్ శెట్టి ఆతిథ్య షట్లర్లను ఓడించారు. మొదట లక్ష్య 11-21, 21-5, 21-19తో ప్రపంచ ఏడో ర్యాంకర్ నరకొరకు షాక్ ఇచ్చాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో స్కోర్లు 14-19 వద్ద ఉండగా వరుసగా ఏడు పాయింట్లు సాధించిన లక్ష్య.. గేమ్‌తో పాటు జట్టును 1-0 ఆధిక్యంలోకి తెచ్చాడు. అనంతరం డబుల్స్ జోడీ సాత్విక్-చిరాగ్ 21-18, 24-22తో టకురొ-కొబయాషి ద్వయాన్ని ఓడించింది.
రెండో సింగిల్స్‌లో ఆయుశ్ 21-10, 21-19తో కొకి వతనబెపై నెగ్గడంతో భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది. అయితే మహిళల జట్టు మాత్రం 1-3తో జపాన్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. సింధు 23-21, 18-21, 6-21తో అకానె యమగుచి చేతిలో పోరాడి ఓడింది. ఉన్నతి సైతం 16-21, 18-21తో మియజకీ జోరు ముందు నిలువలేకపోయింది. డబుల్స్‌లో ట్రీసా-గాయత్రి జోడీ 21-17, 21-16తో ఫుకుషిమా-మసుమొటొ ద్వయాన్ని ఓడించి ఆశలు రేపినా మూడో సింగిల్స్‌లో తన్వి 12-21, 10-21తో ఒకుహార చేతిలో ఓటమిపాలైంది.
టీటీ జట్ల కథ ముగిసె..
టేబుల్ టెన్నిస్‌లో భారత జట్ల కథ ముగిసింది. మహిళల జట్టు ప్రిక్వార్టర్స్‌లో 3-2తో థాయ్‌లాండ్‌ను ఓడించినా క్వార్టర్స్‌లో 0-3తో ఉత్తర కొరియా చేతిలో ఓటమిపాలైంది. మొదట ఆకుల శ్రీజను 0-3తో కిమ్ కుమ్ యాంగ్ ఓడించగా రెండో సింగిల్స్‌లో గ్యాంగ్ అదే ఫలితంతో యశస్వినిని చిత్తుచేసింది. తప్పక గెలవాల్సిన పోరులో దివ్య చిటాలె కూడా 0-3తో సు యాంగ్ ముందు తలవంచడంతో అమ్మాయిల పతక ఆశలకు బ్రేక్ పడింది. ఇక పురుషుల ప్రిక్వార్టర్స్‌లో భారత్ 0-3తో దక్షిణ కొరియా చేతిలో ఓడింది. హర్మీత్, మానుష్, మానవ్ ఠక్కర్ ప్రత్యర్థులకు పోటీనివ్వలేకపోయారు.
గోల్స్ మోత..

Hockey
హాకీలో భారీ విజయాలతో విరుచుకుపడుతున్న భారత జట్లు ప్రత్యర్థులపై గోల్స్ వర్షాన్ని కురిపిస్తున్నాయి. మొదటి మ్యాచ్‌లో ఇండోనేషియాను 13-1తో ఓడించిన హర్మన్‌ప్రీత్ సింగ్ సేన తమ పూల్-ఏ రెండో మ్యాచ్‌లో 16-1తో శ్రీలంకకు చుక్కలు చూపించింది. జుగరాజ్ (10, 22, 42, 53వ నిమిషాల్లో) నాలుగు గోల్స్ కొట్టగా అభిషేక్ (11, 17, 49వ ని.), దిల్‌ప్రీత్ (30, 38, 55వ ని.) హ్యాట్రిక్ గోల్స్‌తో రెచ్చిపోయారు. సారథి హర్మన్‌ప్రీత్ (16, 45) రెండు గోల్స్ చేశాడు. మన్దీప్ (5), సుఖ్జీత్ (29), మన్‌ప్రీత్ (31) తలా ఓ గోల్ సాధించారు.
గన్ పేలలే..
తొలి రెండ్రోజులు వెండి వెలుగులు పంచిన షూటర్లు మూడో రోజు పతకం రాబట్టడంలో విఫలమయ్యారు. పది మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో ఎలవెనిల్ వలరివన్-పార్థ్ మానె జంట నాలుగో స్థానంతో ముగించారు. క్వాలిఫికేషన్ రౌండ్లో 634.6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచినా ఫైనల్లో 376.3 పాయింట్లే స్కోరు చేసి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు. చైనా (502.9), కొరియా (439.7), జపాన్ (439.7) తొలి మూడు స్థానాల్లో నిలిచి పతకాలు సాధించాయి. స్కీట్ షూటింగ్లో అనంత్‌జీత్ సింగ్, రైజా థిల్లాన్ ఫైనల్స్‌కు క్వాలిఫై అయి పతక రేసులోకి వచ్చారు.
వుషూలో మెడల్ గ్యారెంటీ

Roshibina
వుషూలో రొషిబినా దేవి దేశానికి పతకం ఖాయం చేసింది. మహిళల 60 కిలోల క్వార్టర్స్ మ్యాచ్‌లో ఆమె డబ్ల్యూపీడీ (విన్నర్ ఆన్ పాయింట్ డిఫరెన్స్)తో ప్రత్యర్థి చు మన్ సిన్ (మకావు)పై నెగ్గి సెమీస్‌కు చేరుకుంది. కానీ మిగిలిన మ్యాచ్‌లలో ఆర్యన్, హంజబమ్ క్వార్టర్స్‌లోనే వెనుదిరిగారు.
పతక రేసులో ముందంజ

Sakshi Boxing
బాక్సింగ్‌లో సాక్షి చౌదరి, జాదుమణి సింగ్ ప్రిక్వార్టర్స్ చేరారు. మహిళల 51 కిలోల విభాగంలో సాక్షి.. 5-0తో ఐరా విలెగాస్ (ఫిలిప్పీన్స్)ను ఓడించగా జాదుమణి సైతం 5-0తో చంద్ర బహదూర్ (నేపాల్)పై గెలిచి ప్రిక్వార్టర్స్ చేరారు. కబడ్డీలో భారత్ 63-31తో కొరియాను ఓడించి వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. జిమ్నాస్టిక్స్‌లో భారత్ నుంచి ఆడుతున్న ఏకైక జిమ్నాస్ట్ ప్రణతి నాయక్.. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఈవెంట్లో వాల్ట్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.
వీరికి నిరాశ
ఈక్వెస్ట్రియన్‌లో భారత రైడర్లు వ్యక్తిగత విభాగాలతో పాటు టీమ్ డ్రెస్సేజ్లోనూ నిరాశజనక ఫలితాలతో పతక రేసు నుంచి నిష్క్రమించారు. స్విమ్మింగ్‌లో 16 జట్లు పాల్గొన్న మెన్స్ 4X100 మెడ్లీ రిలేలో భారత జట్టు చివరి స్థానంలో నిలిచింది.