హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : రాబోయే శాసనమండలి ఎన్నికలపై పార్టీ నేతలందరూ దృష్టిసారించాల్సిందేనని, ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ రూపొందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. మంగళవారం తెలంగాణభవన్‌లో పార్టీ శాసనసభాపక్ష ఉప నాయకులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితాఇంద్రారెడ్డి, మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులతో కేటీఆర్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, షెడ్యూల్ వచ్చేనాటికే సిద్ధంగా ఉందామని చెప్పారు. పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితాను రూపొందించే కార్యక్రమం ఇప్పుడు జరుగుతున్నదని, ఉమ్మడి మూడు జిల్లాల పరిధిలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ నాయకుడూ పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించేందుకు ప్రయత్నించాలన్నారు.
నియోజకవర్గాల వారీగా పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు ఇతర నేతలు ఓటరు నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పార్టీ అభ్యర్థి గెలిచేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన మూడేండ్లుగా అధికారంలో ఉండి యువతకు, ఉద్యోగులకు ప్రత్యేకంగా చేసిందేమీ లేదని, ఉద్యోగులు, నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశానిస్పృహలు ఉన్నాయని, కాంగ్రెస్ పార్టీ ఇకపై ఏ ఎన్నికలోనూ గెలిచేలా కనిపించడంలేదన్నారు.
బీజేపీ పరిస్థితి కూడా కాంగ్రెస్‌కు భిన్నంగా ఏమీలేదన్నారు. గెలిచేందుకు పుష్కలమైన అవకాశాలు బీఆర్ఎస్ అభ్యర్థికే ఉంటాయని, ఎన్నికల షెడ్యూల్ వచ్చే సమయానికి పార్టీ అభ్యర్థిని కూడా నిర్ణయిస్తుందని చెప్పారు. పార్టీ తరఫున పోటీచేసేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారని, కొంత మంది అభ్యర్థిత్వాలను పార్టీ సీరియస్‌గా పరిశీలిసున్నదని చెప్పారు. పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చేస్తారని, త్వరలోనే పార్టీకి సంబంధించిన ముఖ్యనేతలందరితో మరోసారి భేటీ ఉంటుందని తెలిసింది.