హైదరాబాద్, అక్టోబర్4 (నమస్తే తెలంగాణ) : టీచర్లు గురుతర బాధ్యతలు నిర్వర్తించాలని, విద్యార్థులకు బోధనతోపాటు తల్లిదండ్రుల ప్రేమను పంచాలని సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీ సెక్రటరీ వర్షిణి సూచించారు. ఇటీవల నూతనంగా నియామకమైన 1,150 మంది గురుకుల టీచర్లకు సరూర్‌నగర్‌లో ఏర్పాటుచేసిన ఐదు రోజుల ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గురుకులంలో బోధనా విధానాలు, విద్యార్థులతో వ్యవహరించాల్సిన పద్ధతులు, జీవన నైపుణ్యాలు, సర్వీస్ రూల్స్, వృత్తి, వ్యక్తిగత జీవితాలను సమతుల్యం చేసుకునే అంశాలపై శిక్షణ ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీలు, డిప్యూటీ కార్యదర్శులు, జోనల్ ఆఫీసర్లు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : టాడీ టాపర్స్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు రూ.34 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేషన్ ద్వారా గీత కార్మికులకు సహాయ, సహకారాలు అందించేందుకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.68కోట్లను ప్రతిపాదించగా, అందులో 34 కోట్లను విడుదల చేసింది.