హైదరాబాద్, జనవరి 29(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్‌పై టీచర్లు జంగ్ సైరన్ మోగించారు. రేవంత పాలనతో విసిగిపోయి ఫిబ్రవరిలో పోరుబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లు వేర్వేరుగా వినతులతో సరిపుచ్చిన 33 ఉపాధ్యాయ సంఘాలన్నీ చేతులుకలిపి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించేందుకు ఏకతాటిపైకి వచ్చాయి. ఈ మేరకు గురువారం హైదరాబాద్ జరిగిన కీలక సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చాయి. పీఆర్టీయూ టీఎస్ అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి, ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ల అధ్యక్షతన నారాయణగూడలోని పీఆర్టీయూ టీఎస్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అన్ని సంఘాలు కలిపి ఉపాధ్యాయ ఐక్యవేదికగా ఏర్పడ్డాయి.
మరో ఐదారు సంఘాలు కూడా ఈ ఐక్యవేదికతో జతకూడనున్నాయి. ఇక రాబోయే రోజుల్లో సర్కార్‌పై సమరమేనని, జేఏసీ ద్వారానే ఉమ్మడి ఉద్యమాలు చేయాలని వారు తీర్మానించారు. అయితే ఇది ఎంప్లాయీస్ జేఏసీకి పోటీకాదని, కేవలం విద్యారంగ సమస్యలపై ఉమ్మడి పోరాటం కోసమే జేఏసీగా ఏర్పడ్డామని సదానందం గౌడ్ స్పష్టతనిచ్చారు.
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జేఏసీ ఉద్యమించనున్నది. తొలుత ఫిబ్రవరి 5న ఆలిండియా జాక్టో ఆధ్వర్యంలో నిర్వహించే పార్లమెంట్ మార్చ్‌ను విజయవంతం చేయాలని సమావేశం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి అన్ని సంఘాలు మద్దతు పలికాయి. ఆ తర్వాత మరోసారి జేఏసీ సమావేశం కానున్నది. ఫిబ్రవరి 10 తర్వాత ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని, ఫిబ్రవరి నెల మొత్తం ఉద్యమించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వం, విద్యాశాఖ అధికారుల తీరుపై సమావేశంలో పాల్గొన్న నేతలు తీవ్ర అసంతప్తిని వ్యక్తంచేశారు.
తాము తొమ్మిది పాయింట్ల ఎజెండాను గతంలో సర్కార్ ముందుంచగా, టీచర్ సంఘాలతో సమావేశం నిర్వహిస్తామన్న సర్కార్ విస్మరించిందని, ఉద్యమంతో సర్కార్ కండ్లు తెరిపించాలని సమావేశంలో పాల్గొన్న నేతలు మాట్లాడినట్లు తెలిసింది. రూ.200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్న సర్కార్.. అదే రెండు వందల కోట్లను జిల్లా మొత్తానికి కేటాయిస్తే జిల్లా మొత్తం బాగుపడుతుందని ఓ ఉపాధ్యాయ సంఘ నేత ఫైర్ అయినట్టు సమాచారం. సర్కార్ సంపద్రింపులేవైనా ఉంటే ఇక నుంచి సీఎంతోనే తేల్చుకోవాలని, ఆయనతో సమావేశమంటేనే వెళ్లాలని, లేదంటే ఉద్యమాన్ని కొనసాగించాలని మరోనేత అభిప్రాయపడినట్టు తెలిసింది.
పీ దామోదర్‌రెడ్డి, ఎస్ భిక్షంగౌడ్-పీఆర్టీయూటీఎస్, చావ రవి, ఏ వెంకట్-టీఎస్ యూటీఎఫ్, జీ సదానందం గౌడ్, జుట్టు గజేందర్ – ఎస్టీయూ టీఎస్, కటకం రమేశ్ -టీఆర్టీఎఫ్, అనిల్‌కుమార్, తిరుపతి-టీపీటీఎఫ్, సోమయ్య, లింగారెడ్డి-డీటీఎఫ్, ఎం రాజగంగారెడ్డి, గిరిధర్‌గౌడ్ -హెచ్ఎం అసోసియేషన్, మహ్మద్ అబ్దుల్లా-ఆర్‌యూపీపీ టీ, కే కృష్ణుడు-బీసీటీఏ, మల్లికార్జున్‌రెడ్డి-ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్, వై విజయ్‌కుమార్, ఈ రవీందర్-ఎస్సీ, ఎస్టీయూఎస్ టీఎస్, కొంగల వెంకట్, కొమ్ము రమేశ్-బీటీఎఫ్, జాడి రాజన్న- ఎస్టీ, ఎస్టీటీఎఫ్, హరికిషన్ చౌహాన్-టీటీఏ టీఎస్, ఎండీ అబ్దుల్లా-పీఆర్టీయూ టీ, రాధాకృష్ణ-టీపీటీయూ, విజయ్‌సాగర్, నాగరాజు – టీజీ పెటా, ఖాజా కుత్బుద్దీన్-యూటీఏ టీఎస్, టీఎస్ పీటీఏ, టీఎస్ ఎంఎస్టీఎఫ్, పీఆర్‌జీటీఏ, టీడబ్ల్యూటీఎఫ్, బీటీఎఫ్, టీఎస్ టీటీఎఫ్, ఏఐఐటీఏ, పీఎంటీఏటీఎస్, పీఆర్టీయూ కేజీబీవీ, పీఆర్వీటీయూటీఎస్, ఎంటీయూ టీఎస్ సంఘాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.