హైదరాబాద్, అక్టోబర్ 9(నమస్తే తెలంగాణ) : ఎస్సీ గురుకుల సొసైటీలో ఇష్టారీతిన ఇన్చార్జీల బాధ్యతల అప్పగిస్తున్నారనే విమర్శలు ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా మరోసారి అనర్హులనే అందలం ఎక్కించడం ఇప్పుడు సొసైటీలో చర్చనీయాంశమైంది. ఎస్సీ గురుకుల సొసైటీలో టీజీటీ(ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్)గా ఉద్యోగంలో చేరిన ఓ ఉపాధ్యాయుడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో విధులను నిర్వర్తించి ఆ తర్వాత పీజీటీగా ఉద్యోగోన్నతి పొందారు. ఆ తర్వాత డిప్యూటేషన్‌పై ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించారు. అప్పటినుంచి అక్కడే డిప్యూటేషన్‌పై కొనసాగుతూ ఆ తర్వాత జూనియర్ లెక్చరర్‌గా, ఆపై డిగ్రీ కాలేజీ లెక్చరర్‌గా, గతేడాది డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఉద్యోగోన్నతి పొందారు.
కనీస బోధన అనుభవం లేకుండా యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా గతేడాది ఆగస్టులో మళ్లీ ప్రిన్సిపాల్‌గా ఉద్యోగోన్నతి పొందారు. ప్రమోషన్ తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్‌లోని ఓ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలో పోస్టింగ్ ఇచ్చారు. 20రోజులు తిరగకుండానే మళ్లీ సదరు టీచర్ మళ్లీ హెడ్ ఆఫీస్‌కు ఓడీపై వచ్చారు. ఇప్పుడు సదరు ప్రిన్సిపాల్‌కే ఏకంగా జాయింట్ సెక్రటరీగా ఇన్చార్జీ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. నిబంధనల ప్రకారం మూడేళ్ల అనుభవం ఉన్న వారినే జాయింట్ సెక్రటరీగా నియమించాలి. కానీ ప్రమోషన్ పొంది ఏడాది కాకముందే బాధ్యతలు అప్పగించడం అదీగాక తాజాగా నియమించిన 10 ప్రత్యేకాధికారుల్లో ఆయన ఒకరు కావడం విమర్శలకు తావిస్తున్నది.
ఇటీవల ఇంటర్ బోర్డులో ఆన్డ్యూటీలపై పనిచేస్తున్న ఆరుగురు ప్రిన్సిపాళ్లను వారి సొంత కళాశాలలకు తిరిగి పంపారు. ఇంటర్‌బోర్డు కార్యదర్శిగా ఉన్న కృష్ణ ఆదిత్యే ప్రస్తుతం ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు. కానీ డిప్యూటేషన్లను మాత్రం రద్దు చేయలేదు. ఎస్సీ గురుకుల సొసైటీ ప్రధాన కార్యాలయంలో ఒకరు కాదు ఇద్దరు ఏకంగా 22మంది డిప్యూటేషన్లపై ఏళ్లుగా పాగా వేశారు.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని విద్యాసంస్థల పర్యవేక్షణకు సొసైటీ కార్యదర్శి కృష్ణ ఆదిత్య చర్యలు చేపట్టారు. ఉమ్మడి జిల్లాలవారీగా 10మందిని ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డికి బీ గీత, నల్లగొండకు బీ సక్రునాయక్, ఖమ్మం కే శారద, ఆదిలాబాద్‌కు పీఎస్ఆర్ శర్మ, మహబూబ్‌నగర్‌కు డీ శ్రీనివాస్, నిజామాబాద్‌కు బీ ప్రమోద్‌కుమార్, హైదరాబాద్‌కు జే పద్మజ, కరీంనగర్‌కు సీహెచ్ శైలజ, మెదక్‌కు ఎన్ రజిని, వరంగల్‌కు బి రుత్మణిని నియమించారు.
వీరంతా తమకు నిర్దేశించిన జిల్లాల్లో గురుకులాలను సందర్శించి అకడ ప్రిన్సిపల్, సిబ్బంది, విద్యార్థులతో సమావేశాలు నిర్వహించడంతో పాటు వసతులు, నిర్వహణపై సమీక్షించాలి. అద్దె బకాయిలు, తాతాలిక, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతన చెల్లింపులు తదితర సమస్యలపై ఆరా తీయాలి. గుర్తించిన సమస్యలను నెలలోగా పరిషరించేలా చర్యలు తీసుకోవాలి. యూడైస్, అపార్ ఐడీలను 20 నాటికి పూర్తి చేయాలి. ప్రతి జిల్లాలో సోషల్ మీడియా సెల్ నిర్వహణ కోసం ఒక బృందం ఏర్పాటు చేయాలి. ఇన్స్పెక్షన్ రిపోర్టును రాష్ట్ర కార్యాలయంలో అందించాలని సెక్రటరీ ఆదేశించారు.