కరీంనగర్, జూన్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెంచి.. విద్యార్థులను చేర్చుకునేందుకు ఈ నెల 6 నుంచి 19 వరకు బడిబాట చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అందుకు విరుద్ధంగా ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులు జారీ చేయడం విమర్శలకు తావిస్తున్నది. ఉపాధ్యాయులున్న చోట పిల్లలు లేకపోవడం.. పిల్లలున్న చోట ఉపాధ్యాయులు లేకపోవడం..
తద్వారా ప్రభుత్వ పాఠశాలలు ఆదరణ కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బడిబాట ముగిసిన తర్వాత ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సిన ప్రభుత్వం.. అందుకు భిన్నంగా ఈ నెల 13లోపే ఈ ప్రక్రియ ముగించాలని, అదీ నిరుటి విద్యార్థుల సంఖ్య పరిగణనలోకి తీసుకోవాలని ఉత్తర్వులు ఇవ్వడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. బడిబాటకు, సర్దుబాటుకు మధ్య పొంతనలేని ఉత్తర్వులు ఇచ్చి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మరోసారి తన అస్పష్టతను చాటుకున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిది మంది విద్యార్థులకు ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఉన్నారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుళ్లకోట ప్రాథమికోన్నత పాఠశాలలో 180 మంది విద్యార్థులుంటే.. ఆరుగురు టీచర్లు మాత్రమే ఉన్నారు. ఇది ఒకటిరెండు బడులకు సంబంధించిన వ్యహారం మాత్రమే కాదు.. రాష్ట్రంలోని మెజార్టీ పాఠశాలల్లో ఇదే పరిస్థితి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి, నాణ్యమైన విద్యనుఅందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అవుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది ప్రభుత్వం సర్దుబాటు ప్రక్రియను అక్టోబర్, నవంబర్‌లో చేపట్టింది. అప్పటికే పాఠశాలలకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
రాష్ట్రంలో 26,287 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే.. అందులో ఒక్క విద్యార్థి కూడా లేని పాఠశాలలు 1,864 ఉన్నట్టు నిరుడు సెప్టెంబర్‌లో విద్యాశాఖ విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొంది. 1-30 మంది విద్యార్థులున్న పాఠశాలలు 9,447, 31-100 విద్యార్థులున్న 9,609 ఉన్నట్టు తెలిపింది. ఏయేటికాయేడు ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి జూలైలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విద్యాశాఖ విడుదల చేసిన నివేదికలోనూ.. లక్షల సంఖ్యలో విద్యార్థులు తగ్గుతున్నట్టు పేర్కొంది.
అంగన్వాడీ సిబ్బంది, స్వయం సహాయక సంఘాలు, గ్రామపెద్దలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి బడిబాట నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. ఆచరణలో మాత్రం ఎవరూ పర్యవేక్షణ చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో ఉపాధ్యాయులు మాత్రమే బడిబాట నిర్వహిస్తున్నారు. ‘మీ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరు కదా? పిల్లవాడిని పంపిస్తే ఎలా బోధిస్తారు?’ అని తల్లిదండ్రుల నుంచి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సర్దుబాటుపై ప్రభుత్వం పునరాలోచన చేసి అందుకు అనువైన ఉత్తర్వులు జారీ చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
బడిబాటకు- సర్దుబాటుకు మధ్య పొంతన లేకుండా విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఓ వైపు ఉపాధ్యాయులతో సహా అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చుతామంటూ బడిబాటలో హామీ ఇవ్వాలంటూ ఉపాధ్యాయులకు విద్యాశాఖ చెప్తున్నది. ఈసారి విద్యార్థులకు సరిపడే విధంగా ఉపాధ్యాయులొస్తారని మేము భరోసా ఇస్తున్నాం. కానీ, విద్యాశాఖ సర్దుబాటుకు సంబంధించి విడుదలచేసిన ఉత్తర్వులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. బడిబాట కాకముందే సర్దుబాటు అదీ కూడా గతేడాది విద్యార్థుల గణాంకాలు తీసుకొని సర్దుబాటు చేయాలంటూ ఉత్తర్వులు ఇవ్వడం వల్ల అంతా అయోమయం నెలకొన్నది.
– రాజిరెడ్డి, తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సర్దుబాటుకు సంబంధించిన ఉత్తర్వులు లోపభూయిష్టంగా ఉన్నాయి. బడిబాట తదుపరి మాత్రమే సర్దుబాటు ప్రక్రియ చేపట్టేలా విద్యాశాఖ తక్షణం ఉత్తర్వులు జారీచేయాలి. అప్పుడే ఉపాధ్యాయుల్లో నెలకొన్న అయోమయం, అస్పష్టత పోతుంది. సర్దుబాటు ఉత్తర్వులు వెంటనే సవరించాలి. ప్రాథమిక విద్య అనేది విద్యార్థులకు పునాది దశ లాంటింది. 11-60 మంది విద్యార్థులుంటే ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉండాలని సర్దుబాటు ఉత్తర్వుల్లో విద్యాశాఖ పేర్కొంది. ఇలా అయితే గుణాత్మక విద్యా ఎలా అందుతుంది? ఐదు తరగతులకు కలిపి మొత్తం 18 సబ్జెక్టులుంటాయి.
– మహిపాల్‌రెడ్డి, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు