Teacher Transfers | హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నిలిచిపోయిన టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను విద్యాశాఖ శనివారం నుంచి ప్రారంభించనున్నది. ఈ ప్రక్రియను మల్టీజోన్-1లో శనివారం నుంచి ఈ నెల 22 వరకు, మల్టీజోన్-2లో శనివారం నుంచి ఈ నెల 30 వరకు చేపడతారు. ఈ మేరకు వేర్వేరు షెడ్యూళ్లను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం శుక్రవారం విడుదల చేశారు. కోర్టు కేసుల కారణంగా గతంలో ఎక్కడ ఈ ప్రక్రియ ఆగిపోయిందో అక్కడినుంచి పునఃప్రారంభిస్తారు. ఉపాధ్యాయులకు టెట్‌తో సంబంధం లేకుండానే పదోన్నతులు కల్పిస్తారు. మూడేండ్లలోగా పదవీ విరమణ పొందనున్నవారిని తప్పనిసరి బదిలీ నుంచి మినహాయించారు. ఈ సారి 12,472 మంది టీచర్లు బదిలీకానుండగా, మరో 18,495 మందికి పదోన్నతులు లభించే అవకాశం ఉన్నది. కోర్టు కేసు కారణంగా రంగారెడ్డి జిల్లాలో బదిలీలు, పదోన్నతులకు బ్రేక్‌పడింది. రంగారెడ్డి జిల్లా మినహా రాష్ట్రమంతటా బదిలీలు, పదోన్నతులు కల్పించేందుకు సర్కారు అనుమతిచ్చింది. మొత్తంగా 23 రోజుల్లో ప్రక్రియ పూర్తికానున్నది.
టీచర్ల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదలచేయడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంకు ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పర్వత్‌రెడ్డి, సదానందంగౌడ్ ధన్యవాదాలు తెలియజేశారు. భాషా పండితుల పదోన్నతుల షెడ్యూల్‌ను విడుదల చేయడం పట్ల ఆర్‌యూపీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహ్మద్ అబ్దుల్లా, తిరుమల కాంతికృష్ణ, ఎస్‌ఎల్‌టీఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చక్రవర్తుల శ్రీనివాస్, కర్రెం గౌరీశంకర్రావు హర్షం వ్యక్తంచేశారు.
2