కొణిజర్ల, అక్టోబర్ 13: ఓ బాలుడిపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అమ్మపాలెం తెలంగాణ మైనార్టీ పాఠశాలలో చోటుచేసుకుంది. కొణిజర్ల ఎస్సై సూరజ్ కథనం ప్రకారం.. మైనార్టీ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ అరిగెల ప్రభాకర్ 8వ తరగతి బాలుడిని లైంగికంగా వేధిస్తున్నాడు. దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన సదరు విద్యార్థి.. మళ్లీ హాస్టల్‌కు వచ్చేందుకు నిరాకరించాడు. దీంతో తల్లిదండ్రులు వాకబు చేయగా జరిగిన ఘటనను తల్లిదండ్రులకు వివరించాడు.
అతడి తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 12న ఫిర్యాదు చేశారు. అరిగెల ప్రభాకర్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న ప్రభాకర్ అదే రోజు రాత్రి పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు అతడిని హైదరాబాద్‌లోని దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు.