కూసుమంచి, అక్టోబర్ 19: ప్రాథమిక పాఠశాల బాలికలపై వికృత చేష్టలు చేస్తూ తరచూ వారితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి నిర్వాకం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు ఉపాధ్యాయుడి అనుచిత ప్రవర్తన గురించి విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు తెలియజేయగా వారు పాఠశాలకు వచ్చి హెచ్ఎంకు ఫిర్యాదు చేసిన ఘటన బయటకు వచ్చింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెం క్లస్టర్ పరిధిలో ఉన్న ఒక ప్రాథమిక పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు బాలికల పట్ల వికృత చేష్టలు చేస్తుండేవాడు. బాలికలు ఈ విషయాన్ని ఈ నెల 16న తల్లిదండ్రులకు తెలియజేశారు.
ఆగ్రహించిన తల్లిదండ్రులు 17న పాఠశాలకు వచ్చి హెచ్ఎంకు ఫిర్యా దు చేశారు. టీచర్ల సర్దుబాటులో భాగంగా సదరు ఉపాధ్యాయుడు 16నే రిలీవ్ అయి ఖమ్మం అర్బన్ మండలంలోని మరో పాఠశాలలో చేరాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో హెచ్ఎం విద్యాశాఖ ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. నివేదిక ఆధారంగా దీపావళి సెలవుల అనంతరం ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో ఖమ్మం రూరల్ మండలంలోనూ అక్కడి విద్యార్థినుల పట్ల సదరు ఉపాధ్యాయుడు ఇలాగే అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలో అప్పుడే ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. అయినా బుద్ధి మార్చుకోని సదరు ఉపాధ్యాయుడు తాజాగా కూసుమంచి మండలంలో కూడా తన వక్రబుద్ధిని చూపించాడు.
అయితే, బాలికల తల్లిదండ్రులు తనపై ఫిర్యాదు చేశారన్న విషయం తెలుసుకున్న సదరు ఉపాధ్యాయుడు ఈ ఘటన నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. తన చేష్టలు బయటపడిన వెంటనే సదరు ఉపాధ్యాయ యూనియన్ బాధ్యులను, మరికొంతమందిని కలిసి ఘటన వెలుగులోకి రాకుండా ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టాడు. 18న బంద్, 19న ఆదివారం, 20న దీపావళి సెలవులు ఉన్నందున ఫిర్యాదు దశలోనే ఆగిపోయాలా మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం.