హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : టీచర్లు పాఠాలెలా చెబుతున్నారు.. వసతులెలా ఉన్నాయన్న విషయాలపై విద్యాశాఖ ఆరా తీయనున్నది. రాష్ట్రంలో 1.11లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరిలో 2 శాతం అంటే 2వేల మంది టీచర్లు మొత్తం 24,146 బడుల్లో తనిఖీలు చేపట్టనున్నారు. మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ శనివారం విడుదల చేశారు. త్రైమాసిక, వార్షిక పర్యటన షెడ్యూల్ ప్రకారం తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది.
ఈ తనిఖీల కోసం ప్రత్యేకంగా ఫార్మాట్, చెక్లిస్టును ఉపయోగించాలని సూచించింది. మూడు నెలలకు 50 పాఠశాలలను తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఈ తనిఖీల్లో పాఠ్యాంశాలు, లెస్సన్ప్లాన్ల పరిశీలనపై ప్రత్యేక దృష్టిపెడతారు. గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, సహాపాఠ్య కార్యక్రమాలు, స్పోర్ట్స్, డిజిటల్ ఎడ్యుకేషన్, పీఎం పోషణ్, ఆరోగ్య తనిఖీలు, టాయిలెట్లు, తాగునీరు, ప్రహరీలు, విద్యుత్తు, ఆడిటోరియం, ఆటస్థలాలు, యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్ పంపిణీ పరిస్థితి, ఫలితాలు, పాఠ్యప్రణాళికల అమలును పర్యవేక్షిస్తారు.