బయ్యారం, నవంబర్ 25 : ఏండ్ల తరబడి ఉద్యోగం కోసం ఎదురుచూపు.. ఇక రాదనుకున్న ఉద్యోగం రానే వచ్చింది.. ఆయనతోపాటు ఇంటిల్లిపాదీ ఆనందపడ్డారు.. ఇక తమ కష్టాలు తీరుతాయని సంతోషించారు.. విధి వక్రీకరించింది.. మొదటి నెల జీతం అందుకోకముందే ఉపాధ్యాయుడిని మృత్యువు కబళించింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేటకు చెందిన సండ్ర ఉపేందర్ (46) బీఎస్సీ, బీఈడీ పూర్తి చేశాడు. ప్రైవేట్‌గా ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. ఈ క్రమంలో 2024 డీఎస్సీ ఫలితాల్లో ఎస్జీటీగా ఉద్యోగం సాధించడంతో గంగారం మండలం కుర్సవారిగుంపు ప్రాథమిక పాఠశాలో అక్టోబర్ 16న జాయిన్ అయ్యాడు. సోమవారం బైక్‌పై స్కూల్‌కు వెళ్తుండగా బావురుగొండ గ్రామ సమీపంలో లారీ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టడంతో ఉపేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఏండ్లుగా ఆశగా ఎదురుచూసిన ఉద్యోగం వచ్చిన మొదటి నెల జీతం అందుకోకముందే మృత్యువు ఒడికి చేరారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో కొత్తపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.