T-PRIDE | హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): యువ వికాసం పథకం మాటున కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన టీ-ప్రైడ్, టీ-ఐడియా పథకాలను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ రెండు పథకాలకు సంబంధించిన సబ్సిడీలను రేవంత్రెడ్డి సర్కారు విడుదల చేయకపోవడం, యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేలా అధికారులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను పురిగొల్పుతుండటమే ఇందుకు నిదర్శనం. యువ వికాసం పథకానికి వెంటనే సబ్సిడీలు వస్తాయని, టీ-ప్రైడ్, టీ-ఐడియా పథకాలకు రాయితీలు ఎప్పుడొస్తాయో చెప్పలేమని దరఖాస్తుదారులను అధికారులు అయోమయానికి గురిచేస్తున్నారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ, వికలాంగ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు టీ-ప్రైడ్ (తెలంగాణ స్టేట్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఆంత్రప్రెన్యూర్స్) పథకాన్ని, బీసీలతోపాటు జనరల్ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు టీ-ఐడియా (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఆంత్రప్రెన్యూర్ అడ్వాన్స్మెంట్) పథకాన్ని ప్రవేశపెట్టింది. టీ-ప్రైడ్ కింద 40% మేరకు, టీ-ఐడియా కింద 25% మేరకు సబ్సిడీలు అందించింది. వీటిలో భూముల ధర, స్టాంప్ డ్యూటీ, విద్యుత్తు చార్జీలు, రుణాల్లో రాయితీలు ముఖ్యమైనవి.
కానీ, ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు యువ వికాసం పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా గరిష్ఠంగా రూ.3 లక్షల వరకు రుణం తీసుకున్నవారికి 60 శాతం, రూ.2 లక్షల రుణం తీసుకున్నవారికి 70 శాతం, రూ.1 లక్ష రుణం తీసుకున్నవారికి 80 శాతం సబ్సిడీ కల్పిస్తున్నారు. దీంతో గరిష్ఠ సబ్సిడీ రూ.1.8 లక్షలు దాటడంలేదు. కానీ, బీఆర్ఎస్ హయాంలో టీ-ప్రైడ్ పథకం ద్వారా లబ్ధిదారులు తమ యూనిట్ల ఆధారంగా రూ.50 లక్షల వరకూ సబ్సిడీ అందుకున్నారు. తద్వారా వారు ఉపాధి పొందడమే కాకుండా అనేకమందికి ఉపాధి కల్పించారు.
ప్రస్తుతం టీ-ప్రైడ్, టీ-ఐడియా లబ్ధిదారులకు దాదాపు రూ.3 వేలకోట్ల రాయితీలు పెండింగ్లో ఉన్నాయి. వీటిని విడుదల చేయకుండా తాత్సారం చేస్తున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం.. టీ-ప్రైడ్, టీ-ఐడియాకు ప్రత్యామ్నాయంగా యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టినట్టు నిరుద్యోగ యువత చెప్తున్నారు. టీ-ప్రైడ్, టీ-ఐడియా పథకాలకు దరఖాస్తు చేసుకోలనుకునే ఔత్సాహికులను పరిశ్రమల శాఖ అధికారులు తీవ్రంగా నిరుత్సాహపరుస్తున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు.
టీ-ప్రైడ్, టీ-ఐడియా పథకాలకు సబ్సిడీలు ఇవ్వడం లేదని, యువ వికాసానికి దరఖాస్తు చేసుకుంటే తక్కువ సబ్సిడీ కాబట్టి వెంటనే డబ్బులొస్తాయని నిరుద్యోగులకు అధికారులు ఉచిత సలహాలు ఇస్తున్నట్టు తెలిసింది. దీంతో ప్రభుత్వం నిజంగానే టీ-ప్రైడ్, టీ-ఐడియా పథకాలకు ప్రత్యామ్నాయంగానే యువ వికాసం పథకాన్ని తెరపైకి తెచ్చినట్టు స్పష్టమవుతుంది. కానీ యువ వికాసానికి, ఆ రెండు పథకాలకు మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.