AP CM Chandrababu | హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల మధ్య చర్చల పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు శనివారం హైదరాబాద్‌లో అడుగుపెట్టిన సందర్భంగా సృష్టించిన హంగామా తెలంగాణవాదుల్లో మరోసారి ఆందోళన రేకెత్తిస్తున్నది. తెలంగాణ ఏర్పడిన తరువాత గత పదేండ్లలో ఎన్నడూలేని రీతిలో హైదరాబాద్ పసుపుమయమైంది.
చంద్రబాబు రాక సందర్భంగా హైదరాబాద్‌లో కట్టిన ‘పచ్చ’లహారంపై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. తెలంగాణ రాష్ర్టాన్ని విఫల ప్రయోగం చేయాలని 2015లో కుట్రపన్నిన చంద్రబాబు వస్తుండటం తమ ఆందోళనకు ప్రధాన కారణమని తెలంగాణ ఉద్యమకారులు చెప్తున్నారు. ‘నేను ఈ నెల 6న వస్తున్నా. పరస్పర లబ్ధికోసం మనం ముఖాముఖి కూర్చొని మాట్లాడుకుందాం.
మన సమావేశం రెండు తెలుగు రాష్ర్టాల ప్రజలకు మేలు జరగాలి’ అని ఈ నెల 1న ఏపీ సీఎం చంద్రబాబు.. రేవంత్‌రెడ్డికి రాసింది నిర్దేశపూర్వక లేఖ అని తెలంగాణ సమాజం అభిప్రాయపడుతున్నది. చంద్రబాబు లేఖ అందిన తెల్లారే ‘తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ’ అనే రీతిలో రేవంత్ ప్రత్యుత్తరం రాయడంలోని ఆంతర్యం తెలంగాణ సమాజానికి తెలుసని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బాబు చెప్పుచేతుల్లోనే రేవంత్ పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
2012లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో చంద్రబాబు ఆదిలాబాద్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. డిసెంబర్ 29న పాదయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లా చిట్యాల మండలం టేకుమట్ల శివారులో నాటి టీడీపీ మహిళలు బోనాలతో స్వాగతం పలికారు. ‘జై తెలంగాణ’ అని రాసి ఉన్న బోనాన్ని చంద్రబాబు ఎత్తుకున్నారు. రెప్పపాటులో ఆయన అనుచరులు (ఆంధ్రాభిమానులు) ‘మీరు ఎత్తుకున్న ది ‘జై తెలంగాణ’ అని చెప్పగానే బాబు ఆ బోనాన్ని దించేశారు.
‘రాష్ర్టానికి అతి ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం. 2014లో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాను. పోలవరం వల్ల ముంపునకు గుర య్యే ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నా యి. ఆ ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తే తప్ప ప్రాజెక్టు పూర్తికాదు. ఏడు మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను. నాకీ పదవి వద్దు అని స్పష్టంగా చెప్పాను. ఆ రోజు ప్రధాని మోదీ ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్‌లో పెట్టి, ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చి, ఆ తరువాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారంటే అదొక చరిత్ర’.
– 11 జూన్ 2024లో అమరావతిలోని ఓ కన్వెన్షన్‌లో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు