అవును! తెలంగాణ నుంచి టీడీపీని పారదోలింది కేసీఆరే. ఎందుకంటే.. ప్రజలు తెలంగాణలో ఆ పార్టీ ఉండాలని కోరుకోలేదు. తమ ప్రాంత వ్యతిరేకిగానే చంద్రబాబును ఇక్కడి ప్రజలు చూస్తూ వచ్చారు. సమైక్య పాలనలో తెలంగాణకు చంద్రబాబు చేసిన అన్యాయం, రాష్ట్ర ఏర్పాటుపై రచించిన కుట్రలు, రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆగని అడ్డంకులు, ప్రభుత్వ కూల్చివేతకు పన్నిన కుతంత్రాలు.. ఇవన్నీ తెలంగాణలో ఇప్పటితరం ఇప్పుడప్పుడే మరిచిపోలేదు.
ప్రజామోదం లేకుండా ఒక రాజకీయ పార్టీ.. ప్రత్యర్థి పార్టీని అంతమొందించగలదా? జనం గుండెల్లో పెట్టుకున్న రాజకీయ శక్తి.. ఉత్త గద్దెల్ని కూల్చేస్తే కూలిపోతదా? ప్రజలు నిర్ణయించనంతవరకు రెండూ సాధ్యం కాదు. తెలంగాణవాదులు, ఈ ప్రాంతవాసులు టీడీపీని ఛీత్కరించారు కాబట్టే.. జనమనోరథనాయకుడిగా ఆ పార్టీని ఇక్కడినుంచి వెళ్లగొట్టగలిగిండు కేసీఆర్. గురువు పార్టీ కోసం పరితపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ ఆక్రోశంలో అసలు వాస్తవాన్ని మరిచిపోతున్నారు. ఏ నేతకైనా, ఏ పార్టీకైనా మనుగడను నిర్ణయించేది దాని చేష్టలు, ప్రజల ఇష్టాయిష్టాలు మాత్రమే!
పక్కరాష్ర్టానికే పరిమితమైన పచ్చపార్టీ ఇప్పుడు మళ్లీ తెలంగాణలో కాలుమోప జూస్తున్నది. ఇక్కడి ప్రజల ఆకాంక్షలను దెబ్బతీయడానికి మరోముసుగులో మళ్లా వస్తున్నది. బాబు బీజేపీ వంతపాడటంలో వింతేమీ లేదుగానీ.. పూర్వాశ్రమ వాసనలు వదలని కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా అదే ప్రయత్నం చేయడం గమనార్హం. కాంగ్రెస్‌కు బద్ధశత్రువైన ఎన్డీయే కూటమిలోని టీడీపీని.. తెలంగాణలో మట్టికరిచిన టీడీపీని తిరిగి లేపేందుకు రేవంత్ చేస్తున్నవి అచ్చంగా ‘దింపుడుగల్లం’ ప్రయత్నాలే!
హైదరాబాద్, జనవరి 19(నమస్తే తెలంగాణ) : తెలంగాణలో మళ్లీ జెండా పాతేందుకు ఆంధ్రా నాయకులు కుట్రలు మొదలుపెట్టారా? ఉద్యమ సమయంలో ఒక్కటిగా ఉండి పోరాడిన స్ఫూర్తిని ముక్కచెక్కలు చేసి మళ్లీ రాజకీయ తెరంగేట్రం చేసేందుకు కొత్త బాగోతం మొదలుపెట్టారా? సాధ్యమైనంత వేగంగా రాష్ట్రంలో రాజకీయంగా పట్టు సాధించి మళ్లీ మన నీళ్లు, నిధులు పట్టుకుపోయేందుకు పన్నాగం పన్నుతున్నారా? నాడు, నేడు తెలంగాణ సబ్బండవర్ణాలకు ప్రతిబింబంగా బీఆర్ఎస్ పార్టీని ఒంటరిచేస్తే తప్ప తమ పప్పులు ఉడకవనే నిర్ణయానికి వచ్చారా? అందుకే మూడు పార్టీలు కూటమిగా జట్టు కట్టి దొంగచాటుగా రాష్ట్రంలోకి చొచ్చుకురావాలని ఎత్తులు వేశాయా? తెలంగాణ సమాజంలో ఉన్న చైతన్యానికి కులాల పేరుతో రాజకీయ రంగులు రుద్ది, మన ఐక్యతను దెబ్బతీసి, మన వేలితో మన కంట్లోనే పొడిచి ఓట్లు దండుకునే ముఠా తెలంగాణలో అడుగుపెట్టిందా?
ఒంటికన్ను శుక్రాచార్యుడి తరహాలో అల్లిన ఈ గూడుపుఠానీ వెనుక ఉన్నది ‘రెండు కండ్ల’ చంద్రబాబేనా? ప్రస్తుతం రాజకీయ నిపుణులు, సామాజిక విశ్లేషకుల మధ్య జరుగుతున్న చర్చ ఇది. వీటికి వారు ‘అవును’ అనే సమాధానం ఇస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మాటలు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చేతలు గమనిస్తే ఇది అర్థమవుతుందని చెప్తున్నారు. విడిపోతే చీకట్లో మగ్గిపోతుందని భావించిన తెలంగాణ, పదేండ్ల కేసీఆర్ పాలనలో వెలుగుజిలుగులతో, అభివృద్ధి పరుగులతో దేశంలోనే అగ్రస్థానంలో నిలవడంతో బాబు అండ్ కో కన్ను తెలంగాణపై పడిందని పేర్కొంటున్నారు. ఏపీ ఆర్థిక ప్రగతికి, వ్యవసాయ, పారిశ్రామికరంగాల అభివృద్ధికి ఇంధనంగా వాడుకునేందుకు తెలంగాణను మరోసారి ఆక్రమించాలని చంద్రబాబు వ్యూహరచన చేసినట్టు చర్చ జరుగుతున్నది. ఇందులో భాగంగానే ఏపీలోని కూటమి ప్రభుత్వ భాగస్వామిగా జనసేన పార్టీని తెలంగాణ రాజకీయాల్లో పునఃప్రవేశ పెట్టాలని నిర్ణయించినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో చంద్రబాబుకు ఊపిరిపోసినట్టు అయ్యిందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు తెలంగాణలో బీజేపీ 8 అసెంబ్లీ, 8 లోక్‌సభ సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ, తెలంగాణలో అడుగుపెట్టేందుకు బీజేపీ అండ తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. హైదరాబాద్‌లో వ్యాపారం చేస్తూ, ఆర్థికంగా బలపడిన ఒక ప్రత్యేక సామాజికవర్గం ఇప్పటికీ టీడీపీకి అనుకూలంగానే ఉన్నదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు ఖమ్మం జిల్లాలో కొంతమేరకు ప్రభావం చూపించగలరని చంద్రబాబు బృందం అంచనా వేస్తున్నట్టు సమాచారం. ఈ అవకాశాన్ని వాడుకొని, పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు సిద్ధం అవుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, నేరుగా తానే రంగంలోకి వస్తే తెలంగాణ ప్రజలు నమ్మరనే ఆలోచనతో ఆయన తెర వెనుక ఉండి వ్యవహారం నడిపిస్తున్నట్టు విశ్లేషకులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను తెలంగాణ రాజకీయాల్లో తమ పాచికగా వాడాలని నిర్ణయించినట్టు చర్చ జరుగుతున్నది. మున్నూరు కాపులు పవన్‌కల్యాణ్‌ను ఆదరిస్తారని, సినీ అభిమానుల్లో ఉన్న ఆకర్షణ, బీజేపీకి ఉన్న బలం కూటమికి అదనపు బలంగా మారుతుందని అనుకుంటున్నారట. తెర ముందు జనసేన, అండగా బీజేపీ, తెర వెనుక టీడీపీ ఉండి బీఆర్ఎస్ను ఎదుర్కోవాలని మూడు పార్టీల మధ్య మౌఖిక ఒప్పందం జరిగినట్టు సమాచారం.
తెలంగాణలో రెడ్డి, కమ్మ, కాపు, బీసీ వర్గాలు రాజకీయంగా కీలకంగా ఉన్నాయని, పవన్ కల్యాణ్‌ను బీసీలకు ప్రతినిధిగా చూపించవచ్చని చంద్రబాబు స్కెచ్ వేసినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే పవన్ ఇటీవల కొండగట్టులో పర్యటించినట్టు చెప్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)నిధులతో భక్తులకు విశ్రాంతి గదులు నిర్మిస్తుండగా, శంకుస్థాపన చేసేందుకు పవన్ వచ్చినట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వాస్తవానికి ఇది అతిసాధారణ కార్యక్రమం. టీటీడీ నిధులు ఖర్చు చేసి, చేసే పనులకు పెద్దగా హంగామా ఉండదు. కానీ చంద్రబాబు సూచనలకు అనుగుణంగా పవన్ కల్యాణ్ పర్యటనకు రేవంత్‌రెడ్డి అధికార ప్రాధాన్యత, ప్రచారం కల్పించారని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
తెలంగాణలో తమ కూటమి అడుగుపెట్టే ముందు క్షేత్రస్థాయి ప్రయోగంలో భాగంగా కాపు, కమ్మ సామాజిక వర్గాలకు పట్టున్న ఖమ్మం, వరంగల్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోని మన్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీని ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని, తద్వారా ఓవైపు బీఆర్ఎస్ను ఒంటరిచేసి దెబ్బ కొట్టవచ్చని, మరోవైపు రేవంత్‌రెడ్డికి మేలు జరుగుతుందని అంచనావేసినట్టు చెప్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు బలాన్ని ఇచ్చేందుకే సీఎం రేవంత్‌రెడ్డి ‘బీఆర్ఎస్ను బొందపెట్టి, టీడీపీని నిలబెట్టాలి’ అని పిలుపునిచ్చారనే ప్రచారం జరుగుతున్నది. మున్సిపల్ ఎన్నికల్లో వచ్చే ఫలితాల ఆధారంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీచేసే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తున్నది. అప్పటి వరకు రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కొనసాగనిస్తే అక్కడి నుంచే పోటీ చేస్తారని, లేదంటే కూటమిలో భాగస్వామి అవుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్తెసరు సీట్లు వస్తే, కాంగ్రెస్ నుంచి వేరుపడి కూటమితో కలిసిపోతారని రాజకీయ పరిశీలకులు చర్చించుకుంటున్నారు. రేవంత్‌రెడ్డి మరో 10 ఏండ్ల వరకు తానే సీఎం అని తనకు తానుగా ప్రకటించుకోవటం వెనుక బలమైన కారణం ఇదే అని అంటున్నారు. అయితే, రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఒంటరి చేయడంగానీ, ప్రజల నుంచి దూరం చేయలేరనే విషయాన్ని చంద్రబాబు బృందం మరిచిపోయినట్టున్నదని విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. 25 ఏండ్లకుపైగా సాగుతున్న బీఆర్ఎస్ ప్రస్థానంలో ‘పార్టీని నామరూపాల్లేకుండా చేస్తాం, పార్టీ కనుమరుగవుతుంది’ వంటి ఎన్నో సవాళ్లను బీఆర్ఎస్, కేసీఆర్ ఎదుర్కొన్నారని గుర్తుచేస్తున్నారు. ఈ క్రమంలో నాయకులను లోబరుచుకోవడం మొదలు ఓటుకు నోటువరకు అనేక పార్టీలు సామ, దాన, బేధ, దండోపాయాలను ప్రయోగించాయని గుర్తుచేస్తున్నారు. అయినా బీఆర్ఎస్ను నిలువరించలేకపోయారని, ప్రజల నుంచి దూరం చేయలేకపోయారని పేర్కొంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రతిపక్షంలోనూ నిత్యం ప్రజల కోసం పోరాడుతున్న బీఆర్ఎస్ను ఒంటరి చేయడం కష్టమేనని స్పష్టం చేస్తున్నారు. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన ఫలితాలే ఇందుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు.
తెలంగాణ రాష్ట్రం పసికూనగా ఉన్న రోజుల్లోనే గొంతునులిపి చంపేయాలని గురుశిష్యులు కుట్రలు చేసిన సంగతిని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీడీపీ బలహీనపడింది. 2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేయగా టీడీపీ 15 అసెంబ్లీ సీట్లు గెలిచినా.. ‘ఓటుకు నోటు’తో చంద్రబాబు నిజస్వరూపం, టీడీపీ అసలు బాగోతం బయటపడింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. తెలంగాణ తెచ్చిన ఉద్యమకారుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక, రాష్ట్రంలో ఒక్కొక్క రంగాన్ని మరమ్మతులు చేస్తూ వచ్చారు. కేసీఆర్ అమలుచేసిన సంక్షేమ పథకాలతో ప్రజల్లో మరో పార్టీకి మనుగడ లేకుండాపోయింది. 2018 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఖమ్మం జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచినా పార్టీలో కొనసాగలేదు. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో టీడీపీ చరిత్ర సమాప్తం అయ్యింది. కేసీఆర్ పాలనకు ఆకర్షితులైన ఆ పార్టీ క్యాడర్ ఎకువగా బీఆర్ఎస్ పార్టీలో విలీనమైంది. హైదరాబాద్‌లో పేరుకు టీడీపీ ప్రధానం కార్యాలయం ఉన్నా, ముఖ్యమైన కార్యకలాపాలన్నీ ఏపీ కేంద్రంగానే సాగుతూ వచ్చాయి. కొన్నేండ్లుగా చంద్రబాబు ఎంత ప్రయత్నించినా బీఆర్ఎస్ ముందు పప్పులు ఉడకలేదని చెప్తున్నారు.