నమస్తే తెలంగాణ మాత్రమే బాబు- రేవంత్ మ్యాచ్‌ఫిక్సింగ్ రాజకీయాల గుట్టు విప్పి బజార్లో పెడుతున్నది. నాడు రాయలసీమ ప్రాజెక్టు పనులను ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో జరిపిస్తున్న వార్తను ప్రచురించి ఆ పనులను ఆపేయించింది. నేడు శ్రీశైలంలో ఏపీ నీటి దోపిడీకి మార్గం సుగమం చేయడాన్ని ఏ రోజుకారోజు బట్టబయలు చేస్తున్నది. కుల పత్రికలు, గుల పత్రికలు ఇవి రాయవు.
తెలంగాణ ఎడిషన్‌లో ఒక రకంగా, ఆంధ్రా ఎడిషన్‌లో మరోరకంగా రాసే పచ్చపత్రికలు తోపులా? తెలంగాణ ప్రయోజనాలకోసం నమస్తే తెలంగాణ.. తన ప్రాంత ప్రయోజనాల కోసం సాక్షి కథనాలు రాస్తే అది విద్వేషమా? ఏపీ దోపిడీకి వంతపాడితే ప్రాంత ప్రయోజనమా! తెలంగాణకు ధోకాపై నిలదీస్తే విషప్రచారమా?
రాజకీయాల్లో ఉన్నపుడు వివేకం ఉండాలి. విజ్ఞత ఉండాలి. విశ్లేషణకు తగిన సామర్థ్యం ఉండాలి. నోరుంది. ఎదురుగా ఏది చెప్పినా అచ్చొత్తే తొత్తు మీడియా ఉంది. ఏదైనా మాట్లాడొచ్చు. ఏ బురదైనా చల్లవచ్చు అనుకుంటే కుదరదు. అందునా ఓ పార్టీ ప్రవాచక పాత్ర తీసుకున్నపుడు తమ పార్టీ చరిత్ర, ప్రాంత భౌగోళిక అంశాలు, వర్తమాన రాజకీయాల లోతుపాతులు, ఎత్తుపల్లాలు సమగ్రంగా తెలిసి ఉండాలి. అది లోపిస్తే ప్రవాచకుడు కాస్త మూర్ఖ వాచాలుడవుతాడు. పక్క రాష్ర్టానికి చెందిన ఓ పార్టీ వాచాలుడు మంగళవారం నిర్వహించిన ఏకపాత్రాభినయం కం క్లిప్పింగ్ షో ఇదే నిరూపించింది.
హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : ఈ షో సారాంశం ఏమిటి? సదరు వాచాలుని బాధ ఏమిటి? ఆయన మాటల్లోనే.. నమస్తే తెలంగాణ, సాక్షి కలిసి ఇరు రాష్ర్టాల ప్రజలను రెచ్చగొడుతున్నాయి. బీఆర్ఎస్, వైసీపీ నీటి దోపిడీ అంటూ విద్వేషాలు సృష్టిస్తున్నాయి. మా టీడీపీ సొక్కం బంగారం.. ఇరు రాష్ర్టాల ప్రయోజనాలు కాపాడేందుకు తెగ కష్టపడుతోంది. కానీ నమస్తే, సాక్షి కూడబలుక్కుని స్వార్థ రాజకీయాల కోసం యుద్ధవాతావరణం సృష్టిస్తున్నాయి…వగైరా..! అయితే ఈ వాచాలుడైనా.. వెనుకున్న వాైళ్లెనా గుర్తించాల్సింది ఏమిటంటే.
నమస్తే తెలంగాణ పుట్టిందే ఈ ప్రాంత ప్రయోజనాలు పరిరక్షించడానికి. అవసరమైతే అక్షర పోరాటం జరపడానికి. గత దశాబ్ద కాలంగా నమస్తే చరిత్ర అదే. ఇకముందు కొనసాగేదీ అదే. ఇక్కడి తిండి తిని, పక్క రాష్ట్రపు నీటి వాటాలకోసం టీఎంసీల కొద్దీ కన్నీరు కార్చడానికి నమస్తే తెలంగాణ ముష్టి పత్రిక, పచ్చ పత్రిక, కుల రొచ్చు పత్రికా కాదు. నికార్సయిన తెలంగాణ పత్రిక. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నపుడు రొచ్చు పత్రికలు ఎలాగూ రాయవు. కుల వర్గ పెద్దలు రాయనివ్వరు. అందువల్లే నమస్తే ఈ విషయంలో చురుకైన పాత్ర తీసుకుంటున్నది.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఒకే యాజమాన్యంలో ఉన్న పచ్చపత్రికలు తెలంగాణ ఎడిషన్‌లో వార్తను ఒక రకంగా, ఆంధ్రా ఎడిషన్‌లో మరోరకంగా రాస్తే వాళ్లు తోపులు. ఇవాళ తెలంగాణ ప్రయోజనాలకోసం నమస్తే.. అలాగే తన ప్రాంత ప్రయోజనాల కోసం సాక్షి కథనాలు రాస్తే అది విద్వేషం. ఇంతకీ ఈ వాచాలుడికి విద్వేషం అనే పదానికి అర్థం తెలుసా? ఉద్యమ కాలంలో పచ్చ పత్రికలు రాష్ట్రం ముక్కలు, బంక చెక్కలు అంటూ ఆంధ్రాలో జనాన్ని రెచ్చగొట్టి రోడ్ల మీదికి తెస్తే అది ప్రాంత ప్రయోజనం. ఈ రోజు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను నిలదీస్తే ఇది విద్వేషం. ఇవాళ బీఆర్ఎస్,నమస్తే విద్వేషాలు రెచ్చగొడుతున్నాయంటూ ఆరోపిస్తున్న బీఆర్ఎస్సే అధికారంలో ఉన్న పదేండ్లు తెలంగాణలో ఒక్క విద్వేషపూరిత ఘటన అయినా జరిగిందా? నమస్తే అలాంటి ఒక్క కథనమైనా ప్రచురించిందా?అదే జరిగి ఉంటే పచ్చ మీడియా ఇంకా ఇక్కడ ఉండేదా?
వర్తమాన అంశమే గీటురాయి…
ఇంకా వాచాలుడేమంటాడు? నమస్తే, సాక్షి రెండు పత్రికలు,బీఆర్ఎస్ వైసీపీ పార్టీలు కుమ్మక్కయ్యాయట. మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నాయట. అందుకే ఒకే వారంలో రెండు పత్రికలు ఒకే అంశం మీద కథనాలు వేశాయట. మెడకాయ మీద తలకాయ ఉన్న వాడెవడన్నా చెప్తాడు. నికార్సయిన మీడియా ఏదైనా.. వర్తమానంలో జరిగే.. జరుగుతున్న అంశాల మీదనే కథనాలు రాస్తాయి. పచ్చ పత్రికలు బాబు మీద ఎలాగూ రాయవు. కానీ తెలంగాణ పత్రికగా నమస్తే తెలంగాణ ఈ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నపుడు కండ్లు మూసుకొని కూర్చోబోదు. అయినా నమస్తే ఏం రాసింది?.. సాక్షి ఏం రాసింది? అసలు అవి తీసుకున్న కోణమేమిటి? రెంటికీ సంబంధమేమిటి?..
బాబు కులగ్యాంగ్ మీడియాలన్నింటికీ కలిపి సీఎంవోలో ఒకే ఎడిటోరియల్ బోర్డు ఉండొచ్చు…దానికి ముఖ్యనేత చీప్ ఎడిటర్‌గా ఉండొచ్చు. కానీ నమస్తే తెలంగాణ, సాక్షి.. రెండు పత్రికల ఎజెండాలు వేరు.. ప్రియారిటీలు వేరువేరు. నమస్తేకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం. అందుకే తెలంగాణలో చురుకైన ప్రతిపక్ష పాత్ర తీసుకుంది. సాక్షి సహజంగా ఏపీలో విపక్ష పాత్ర తీసుకుంది. అక్కడైనా ఇక్కడైనా నికార్సైన పత్రికలకు ఆయా రాష్ట్రప్రయోజనాలే గీటురాయి. అంతే తప్ప మ్యాచ్‌ఫిక్సింగ్‌లు, వెన్నుపోట్లు, ఓట్ల కొనుగోళ్లు చేసుకోవడానికి ఇవి పచ్చ రాజకీయలు కావు. అదీగాకుండా..ఎవరితో సంబంధం లేకుండా నమస్తే పత్రికను స్వతంత్రంగా, స్వేచ్ఛగా నడుపుకోగలిగిన సామర్థ్యాలు ఇక్కడి ఎడిటోరియల్ బోర్డుకు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ ప్రస్తానంలో రాటుదేలి, తెలంగాణ సాధన కోసం, తెలంగాణ శ్రేయస్సుకోసం అక్షర పోరాటాలు జరిపిన చరిత్ర నమస్తేది. ఇవాళ ఎవడో ఏదో సోది చెప్పినా. బురద చల్లినా.. నీలాపనిందలు వేయచూసినా నమస్తే తెలంగాణ వెంట్రుక కూడా కదల్చలేరు. గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేసి భంగపడిన మీడియాధిపతులు, కులకింకరుల కలాలు ఇంకిపోయాయే తప్ప ఏమీ జరగలేదు
ఎందుకా ఏడుపు?
వాచాలుడు ఆయన పార్టీ టార్గెట్ నమస్తే తెలంగాణ! ఎందుకు? నమస్తే తెలంగాణ మాత్రమే బాబు- రేవంత్ మ్యాచ్‌ఫిక్సింగ్ రాజకీయాల గుట్టు విప్పి బజార్లో పెడుతున్నది. నాడు నిబంధనలన్నీ తోసిరాజని రాయలసీమ ప్రాజెక్టు పనులను ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో జరిపిస్తున్న వార్తను ప్రచురించి ఆ పనులను ఆపేయించింది. ఇవాళ శ్రీశైలంలో నీటి దోపిడీకి రేవంత్ మార్గం సుగమం చేయడాన్ని బట్టబయలు చేస్తున్నది. ఇవేవీ పచ్చ పత్రికలు, కుల పత్రికలు, గుల పత్రికలు రాయవు. కానీ నమస్తే తెలంగాణ నికార్సయిన తెలంగాణ పత్రిక.
తెలంగాణ ప్రయోజనాలకోసం కంకణం కట్టుకుని పనిచేస్తున్న పత్రిక. ఎవడి ఒత్తిడికి బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగని పత్రిక. అదీ వాళ్ల బాధ. అదీ వాళ్ల ఏడుపు. అయినా సరే..ఎవడేమనుకున్నా.. ఏం కతలు పడ్డా నమస్తే తెలంగాణ ప్రయోజనాల వైపే నిలబడుతుంది. తెలంగాణకు చుక్క నీటికి లోటు వచ్చినా బరాబర్ కొట్లాడుతుంది. ఢంకా బజాయించి కొట్లాడుతుంది. ఏవడో ఏబ్రాసిగాడు ఏదో నాలుగు క్లిప్పింగులతో బురద చల్లాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు.
ఆయన సుద్దపూస మాటలు చూడండి..చంద్రబాబు ఉభయ రాష్ర్టాలు సస్యశ్యామలంగా ఉండాలని..ప్రజలు బాగుండాలని కోరుకునే స్టేట్స్‌మేన్ అట. అలా కోరుకోవడమే స్టేట్స్‌మేన్ లక్షణమట. పోలవరం ప్రాజెక్టువల్ల ఉభయరాష్ర్టాలకు.. అంటే ఆంధ్రాతోపాటు తెలంగాణకూ ప్రయోజనమట. నదుల అనుసంధానం వల్ల రెండు రాష్ర్టాలకూ నీటి లభ్యత పెరుగుతుందట. పాపం ఆయన చదివిన పాఠశాలలో భూగోళశాస్త్రం సబ్జెక్ట్ ఉందో లేదో? మనకి తెలియదు. అయినా పోలవరం వల్ల తెలంగాణకు నీరు వస్తుందని ఇప్పటిదాకా ఏ శాస్త్రజ్ఞుడు కనుక్కున్నట్టు లేదు. అలాగే నదుల అనుసంధానంలో ఇచ్చంపల్లి కడితే తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం మునిగిపోవడం తప్ప నీటి లభ్యత ఎక్కడ పెరుగుతుందో మనకైతే తెలియదు.

విద్వేషాలు సృష్టిస్తున్నదెవరు?
పాపం.. ఆ వాచాల చక్రవర్తి తన ప్రసంగంలో ‘బీఆర్ఎస్, జగన్ కలిసికట్టుగా విద్వేషాలు రెచ్చగొడుతున్నారు’ అని ఎన్నిసార్లు అన్నారో లెక్కేలేదు. అంతేనా?.. స్వార్థ రాజకీయాలకోసం ఇరు రాష్ర్టాల మధ్య యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నారట. కుట్రలు చేస్తున్నారట. మ్యాచ్ ఫిక్సింగట. ఇంతకీ ఈ విద్వేషాలు ఎవరు రెచ్చగొట్టినట్టు? కుట్రలు ఎవరు చేసినట్టు? ఈ మాటలు తెలిసి మాట్లాడారా? తెలియక మాట్లాడారా? పదాలు గంభీరంగా ఉన్నాయని వాడేశారా? తెలియదు గానీ… కాళేశ్వరం ప్రారంభానికి ఏపీ సీఎం హోదాలో జగన్ హాజరైతే ఆ అంశం మీద ఏపీ శాసనసభలో రచ్చరచ్చ చేసింది టీడీపీయే! రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని, రైతుల గొంతు కోశారని..పోలవరం ప్రశ్నార్థకమని వీలైన అన్ని గంభీర పదాలన్నీ వాడేశారు. జగన్‌ను రాష్ట్ర ద్రోహిగా నిలబెట్టాలని శాయశక్తులా ప్రయత్నించారు.
ఇందులో విద్వేషాలు రెచ్చగొట్టడం కనిపించలేదా? అదే ప్రారంభానికి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కూడా వచ్చారు. మరి ఆ రాష్ట్రంలో విపక్షం ఇలాంటి రోత ఆరోపణలు చేసిందా? ఇంతకీ జగన్ అన్నదేమిటి? ఇరు రాష్ర్టాల మధ్య సామరస్యానికి కేసీఆర్ విశాల హృదయంతో వ్యవహరిస్తున్నారని కితాబిచ్చారు. ఆ సామరస్య వాతావరణం కోసమే తాను ఆ కార్యక్రమానికి వెళ్లానని చెప్పారు. ఇందులో మ్యాచ్ ఫిక్సింగ్ ఏముంది? మరి ఏ మ్యాచ్ ఫిక్సింగ్‌తో చంద్రబాబు రేవంత్‌ను కలిసేందుకు వెళ్లారు? తమ రాష్ర్టానికి నీళ్లు అవసరమైనపుడు వేల టీఎంసీలు సముద్రంలో వృథాగా పోతున్నాయని, ఎగువ రాష్ట్రం ఏ చిన్న ప్రాజెక్టు కడుతున్నా ఏపీ ఎడారి అవుతుందని ఒక రెడీమేడ్ ప్రసంగం చేయడం బాబు అండ్ కోకు బాగా అలవాటు. ఆఖరుకు అతి చిన్న బాబ్లీ మీద ఏదో పక్కదేశం మీదికి యుద్ధానికి పోయినట్టు దండయాత్రకు పోయి వాళ్లతో ఛీ కొట్టించుకొని గెంటేయించుకున్న చరిత్ర ఏ పార్టీది? ఇదీ కూడా చంద్రబాబు మార్కు ‘స్టేట్స్‌మేన్’ వ్యవహారమేనా?
పార్లమెంటు పరాభవం చాలదా?
అదొక్కటేనా? రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సీఎం ఏం చేశారు? ఏపీలో బాబు ఏం చేస్తున్నాడు? అనేది సాక్షాత్తూ లోక్‌సభలో ప్రధాని మోడీ వివరించి ఛీ కొట్టారు. అయినా సిగ్గులేకుండా ఆ మోడీ కాళ్లమీద పడి కూటమి కట్టిన మెగా స్టేట్స్‌మేన్ ఎవరో అందరికీ తెలుసు. స్టేట్స్‌మేన్ అనే పదానికి పాదాక్రాంతం అనే అర్థం కూడా ఏమన్నా ఉందేమో డిక్షనరీలు చూడాలి.
ఎన్నికల్లో జగన్ గెలుస్తారనే సమాచారముందని కేసీఆర్ అన్నారు. అయితే ఏమిటి? అది కుట్ర చేయడమవుతుందా? బుర్రలో గుజ్జు ఉన్నవాడెవడన్నా దీన్ని కుట్ర అంటాడా? సహజంగానే పక్కరాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నపుడు ఫలితాల మీద వివిధ మార్గాల ద్వారా అందే సమాచారాన్ని బట్టి రాజకీయ నేతలకు ఒక అంచనా ఉంటుంది. అది నిజం కావచ్చు.. కాకపోవచ్చు. ఆ మాటకొస్తే 2019 ఎన్నికలకు ముందు ఏపీలో టీడీపీకి 150 సీట్లు వస్తున్నాయని ఓ ముష్టి పత్రిక రాసింది. కానీ జగన్ పెద్ద మెజారిటీతో గెలిచాడు. అంతెందుకు? గత పార్లమెంటు ఎన్నికల్లో 300కు పైగా సీట్లు గెలుస్తున్నామని బీజేపీ, అలాగే అనేక సర్వే సంస్థలు అంచనా వేశాయి. అవి నిజమయ్యాయా? బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తున్నామని ఇండియా కూటమి చెప్పుకుంది. జరిగిందా? ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఘోర ఓటమిని ఎవరన్నా అంచనా వేశారా?
ఇదీ స్టేట్స్‌మేన్ చరిత్ర..
ఇక స్టేట్స్‌మేన్ చరిత్ర ఏమిటి? వర్తమానం ఏమిటి? తెలంగాణ ఎన్నికల్లో ఓటు కొనుగోలుకు లక్షలకొద్దీ డబ్బుమూటలు పంపడం, బ్రీఫ్డ్ మీ అంటూ సంకేతాలిచ్చినవాడు స్టేట్స్‌మేన్ పదానికి అర్హుడా? తెలంగాణకు అనుకూలమని లేఖ ఇచ్చి..తీరా తెలంగాణ ప్రకటించాక అర్ధరాత్రి ప్రకటించారు అంటూ విద్వేషాలు రెచ్చగొట్టి, కృత్రిమ ఉద్యమాలు నడిపి 1200మంది యువకులను బలిగొనడం స్టేట్మేన్షిప్పా? తెలంగాణ వస్తున్న తరుణంలో రోజుకో కథనంతో ఏపీలో విద్వేషాలు రెచ్చగొట్టింది పచ్చ మీడియా కులరత్నాలు కాదా? కాళేశ్వరంనుంచి మొదలుకొని పాలమూరు దాక తెలంగాణలోని అన్ని ప్రాజెక్టుల మీద చంద్రబాబు సర్కార్ ఫిర్యాదులు ఇవ్వడం ఇరు రాష్ర్టాల ప్రజల బాగుకోరడమా? ఇది ఇరు రాష్ర్టాలు సస్యశ్యామలం కావాలని కోరుకోవడమా? విభజన జరిగిన తర్వాత రాత్రికి రాత్రి కేంద్రాన్ని బెదిరించి, తెలంగాణను వంచించి ఏడు మండలాలను ఏపీలో కలుపుకోవడం స్టేట్స్మేన్షిప్పా? నిబంధనలు అంగీకరించకపోయినా.. కోర్టులు స్టే ఇచ్చినా అర్ధరాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో రాయలసీమ పథకం పనులు జబర్దస్తీగా చేయడం స్టేట్స్మేన్షిప్పా? అసలు చంద్రబాబు రాజకీయ జీవితమే కుట్రల మయం. మామకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర.ఎన్టీఆర్ కుటుంబాన్ని చీల్చిన చరిత్ర. రైతు ఆత్మహత్యలకు బీజం వేసిన పాలన. పంటలు లేక వలసల పాలైన పాలమూరుకోసం ప్రాజెక్టు చేపడితే దాన్ని అడుగడుగునా అడ్డుకున్న దుర్మార్గం. కొత్త రాష్ట్రంగా తెలంగాణ విద్యుత్ ఇబ్బందులు ఎదుర్కుంటుంటే పగబట్టి విద్యుత్ ఒప్పందాలు ఏకపక్షంగా రద్దు చేసిన చరిత్ర. అలాంటి వాడు ఇరు రాష్ర్టాల బాగు కోరేవాడా? ఎవడన్నా వింటే నవ్విపోతారు.
– నమస్తే తెలంగాణ ఎడిటోరియల్ డెస్క్
టీడీపీకి అజీర్ణం.. పచ్చ మీడియాకు నిద్రలేమి
ఇంతకీ ఈ వక్రవాచాల కార్యక్రమానికి కారణం ఏమిటి? బాబు- రేవంత్ చీకటి దోస్తీ సాక్ష్యాధారాలు సహా నమస్తే బయట పెట్టింది. రేవంత్ గొప్పలకు పోయి ఇచ్చిన ప్రకటన అక్కడ బాబు సర్కారును ఇరకాటంలో పెట్టింది. మ్యాచ్ ఫిక్సింగ్ బయటపడడంతో మింగలేని కక్కలేని పరిస్థితి వచ్చింది. దొంగతనం బయట పడ్డది. ప్రజల్లోకి ఈ అంశం వేగంగా వెళుతున్నది. బనకచర్లనుంచి నల్లమలసాగర్ దాక చీకటి దోస్తానా మ్యాచ్‌ఫిక్సింగ్ యవ్వారాలన్నీ నమస్తే తవ్వితీసి ఎత్తిపోసి బజారున పెట్టింది. ఇది టీడీపీకి జీర్ణం కావడం లేదు. తెలంగాణలోని పచ్చమీడియాకు నిద్రేపట్టడం లేదు. అదే టీడీపీ వాచాలుడి ఏకపాత్రాభినయంలో ప్రస్ఫుటమైంది. ఒకనాడు నిబంధనలు ఉల్లంఘించి కోర్టు ఆదేశాలు ధిక్కరించి అర్ధరాత్రి ఫ్లడ్ లైట్ల వెలుతురులో రాయలసీమ పథకం పనులు జరుపుతున్న దృశ్యాలను నమస్తే ప్రచురించింది. ఇవాళ మ్యాచ్‌ఫిక్సింగ్ వ్యవహారాలన్నీ ఉతికి ఆరేస్తున్నది. ఇది రాజకీయంగా చెమటలు పట్టి, ప్యాంట్లు తడిసే పరిస్థితి వచ్చింది. దీంతో అత్త మీది కోపం దుత్త మీద చూపినట్టు ఈ వార్తలను తవ్వితీసిన నమస్తే తెలంగాణ మీద పడ్డారు.
సదరు వాచాలునికి సూటి ప్రశ్నలు..