న్యూఢిల్లీ, జనవరి 12:విప్రో నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.2,969 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,968 కోట్లతో పోలిస్తే ఫ్లాట్‌గా నమోదైంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 29.6 శాతం ఎగబాకి రూ.15,670 కోట్ల నుంచి రూ.20,313.60 కోట్లకు ఎగబాకింది. మరోవైపు, ప్రస్తుత త్రైమాసికంలో 2,692 మిలియన్ డాలర్ల నుంచి 2,745 మిలియన్ డాలర్ల మధ్యలో ఆదాయం ఆర్జించవచ్చునని ముందస్తు అంచనాల్లో వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ప్రతిషేరుకు రూ.1 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ షేరు రూ.691.35 వద్ద ముగిసింది.