Singareni | హైదరాబాద్ : సింగరేణిని రక్షించింది కేసీఆరే అని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి నిర్వీర్యం కావడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కారణమని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి మిర్యాల రాజిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
ప్రపంచ వ్యాప్తంగా 2050 వరకు థర్మల్ పవర్ వుండవద్దని కుట్ర పన్నారు. బొగ్గు బ్లాకులను ప్రయివేటీకరణ చేస్తున్నారు. కేసీఆర్ ను ఒప్పించి కొప్పుల ఈశ్వర్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. సింగరేణి కార్మికులకు ఎక్స్ గ్రేషియా ఇప్పించింది కేసీఆర్ ప్రభుత్వం. సింగరేణిలో 40వేలమంది కార్మికులు ఉండటానికి కారణం కేసీఆర్. కేసీఆర్ సీఎం కాకపోతే సింగరేణిలో 25వేల మంది ఉద్యోగులు ఉండేవారు కాదు అని రాజి రెడ్డి పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో కార్మికసంఘాలకు గౌరవాధ్యక్షులుగా పనిచేసినవారు రాజీనామా చేశారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మీటింగ్ పెట్టుకుని కొప్పుల ఈశ్వర్‌ను ఎన్నుకున్నాం. కార్మిక చట్టాలకు అనుగుణంగా కొప్పుల ఈశ్వర్‌ను గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకున్నాం. అంతకుముందు అనేకమంది తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవాధ్యక్షులుగా పని చేశారు. సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా ప్రకటించకపోతే కార్యాచరణ ప్రకటిస్తాము అని రాజిరెడ్డి హెచ్చరించారు.