బడంగ్పేట్, ఆగస్టు 16: ప్రముఖ కవి, జర్నలిస్టు, విమర్శకుడు తంగిరాల చక్రవర్తి శనివారం గుండెపోటుతో మరణించారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని కపిలేశ్వరపురం. ప్రస్తుతం ప్రజాశక్తి బుక్‌హౌస్‌లో పనిచేస్తున్నారు. తెలుగు సాహిత్యంలో కథా కవిత, నాటకం, వ్యాసం, నవల, గ్రంథ సమీక్ష, విమర్శ మొదలైన ప్రక్రియలలో మూడు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. తన తండ్రి పేరిట తంగిరాల మోమోరియల్ ట్రస్టును ప్రారంభించి ప్రతియేట నాటకరంగ ప్రముఖులను సత్కరిస్తున్నారు.
అఖిల భారత భాషా సాహిత్య సమ్మేళన్ (భోపాల్)లో జీవితసభ్యునిగా, సాహితీ స్రవంతి రాష్ట్ర కమిటీలో సభ్యునిగా ఉన్నారు. ఆకాశవాణి విజయవాడ, హైదరాబాద్ కేంద్రాలలో, లండన్ తెలుగు రేడియోలో ప్రసంగాలు చేశారు. సాహితీ రత్న, సాహితీ యువరత్న, సాహితీ సుధ, కళారత్న, నటమిత్ర, సమన్వయశ్రీ, పాత్రికేయ కిరీటి వంటి బిరుదులను అందుకున్నారు. విచ్చిత్తి చీడపురుగులు, గాలిబ్రతుకులు, మిరాశీ, దర్శకుడు ధర్మయ్య, వరశుల్కం, అద్దె యిల్లు తదితర నాటకాలు, నాటికల్లో నటించారు. నటుడు నరసింహ, స్నిగ్ధవృదయి, ఆకలి, రాబందులు, సృష్టి విజ్ఞానం, కథా సాహిత్యం కథా మందారం, చక్రవర్తి కథలుతోపాటు పలు పుస్తకాలను ప్రచురించారు.
ప్రముఖ కవి, రచయిత తంగిరాల చక్రవర్తి మరణం పట్ల తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, తెలంగాణ పబ్లికేషన్స్ నిర్వాహకుడు కోయ చంద్రమోహన్ ప్రగాఢ సంతాపం తెలిపారు. చక్రవర్తి పార్థివదేశం వద్ద జూలూరు తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తంగిరాల జర్నలిస్టుగానే కాకుండా వందలాది పుస్తకాలను ప్రచురించడంలో కీలకపాత్ర పోషించినట్టు గుర్తుచేశారు.
వారితో పాటు రచయితలు కూర చిదంబరం, మోహన్‌కృష్ణ, ముజాహిద్, నరేశ్, సుధాకర్, వాగ్దేవి తదితరులు చక్రవర్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తంగిరాల చక్రవర్తి మరణ వార్త తెలుసుకున్న నవతెలంగాణ పత్రిక సీజిఎం ప్రభాకర్, సీపీఎం నాయకులు ఎస్ వీరయ్య, ఆంధ్రా యూనివర్సిటీ రిటైర్డ్ వైస్‌చాన్స్‌లర్ ఇనాక్, ప్రజాశక్తి బుక్‌హౌస్ ఎడిటర్ ఆనందచారి తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు. బాలాపూర్‌లో అభిమానులు, స్నేహితుల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.