మరి ఆమె గవర్నర్ కాలేదా?
కౌశిక్ ఎమ్మెల్సీ అయితే తప్పేంది?
గవర్నర్ గవర్నర్‌గా ఉంటే గౌరవిస్తాం
ఆమెను అవమానించింది ఎక్కడ?
ఊహించుకుంటే ఏం చేయలేం: కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): తమిళిసై రాజకీయ నేపథ్యం నుంచే వచ్చి గవర్నర్ అయ్యారని మంత్రి కే తారకరామారావు అన్నారు. ఆమె గవర్నర్ పదవి చేపట్టేందుకు అడ్డురాని రాజకీయ నేపథ్యం.. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి అడ్డువస్తుందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఆమె చేస్తున్న వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. అసలు గవర్నర్‌కు ఎక్కడ అవమానం జరిగిందో చెబితే వింటామని.. అర్థం చేసుకుంటామని, గవర్నర్ పట్ల ఉండాల్సినంత గౌరవంగా ఉంటున్నామని చెప్పారు. అలాంటప్పుడు తమకెందుకు పంచాయితీ ఉంటుందని ప్రశ్నించారు. పంచాయితీ ఉన్నట్టు ఆమె ఎందుకు ఊహించుకుంటున్నారో అర్థం కావడం లేదని అన్నారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహాధర్నా అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమిళిసై వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఎవరు ఎవరిని అవమానించారో, అవమానం జరిగినట్టు ఎందుకు ఊహించుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. గవర్నర్ గవర్నర్‌లా వ్యవహరిస్తే తప్పకుండా గౌరవిస్తాం అన్నారు. గవర్నర్ వ్యవస్థ పట్ల ఎంతగౌరవంగా ఉండాలో అంతే గౌరవంగా ఉంటున్నామని, ఎలా ఉండాలో చెబితే అలా ఉంటామని స్పష్టం చేశారు. కౌశిక్‌రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉన్నందువల్లే ఎమ్మెల్సీ నియామకం ఆమోదించలేదని, అందుకే తనను అవమానిస్తున్నారని గవర్నర్ ఇటీవల చెప్పారని, ఆమె అలా అనుకోవడం సరైందికాదని అన్నారు.
కౌశిక్‌రెడ్డి రాజకీయ నేపథ్యంపై గవర్నర్ మాట్లాడినట్టు విన్నానని, పేపర్లలో చూశానని తెలిపారు. గవర్నర్ కావడానికి అడ్డురాని రాజకీయ నేపథ్యం ఎమ్మెల్సీ కావడానికి అడ్డువస్తుందా? ఇప్పుడు గవర్నర్ పదవిలో ఉన్న తమిళిసై నిన్నమొన్నటి దాకా ఎవరు? అని ప్రశ్నించారు. తమిళనాడు బీజేపీ పార్టీ అధ్యక్షురాలుగా వ్యవహరించిన ఆమె గవర్నర్ కావచ్చుగానీ, ఎమ్మెల్సీ కావడానికి రాజకీయ నేపథ్యం అడ్డు వస్తదా? అన్నారు. రాజ్యాంగ వ్యవస్థల పట్ల తమకు సంపూర్ణ గౌరవం ఉన్నదని నొక్కిచెప్పారు. ఆమె ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నారో తెలియడం లేదని, మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒక సంవత్సరంలో శాసనసభ సమావేశాలు మొట్టమొదటిసారి జరిగినపుడు మాత్రమే గవర్నర్ ప్రసంగం ఉండాలని రాజ్యాంగం పేర్కొంటున్నదని తెలిపారు.
అది మొదటి సమావేశం కాదని, నిరవధిక వాయిదా అనంతరం సభ తిరిగి సమావేశం అయినందున గవర్నర్ ప్రసంగం లేదని చెప్పారు. దానిని అవమానంగా భావిస్తే తామేమి చేసేదని విస్మయం వ్యక్తం చేశారు. గవర్నర్‌గా నరసింహన్ ఉన్నప్పుడు తమకు ఎలాంటి పంచాయితీ లేదని, ప్రస్తుత గవర్నర్ తమిళిసైతో మాత్రం తమకెందుకు పంచాయితీ ఉంటదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నదని, అది, చాలదన్నట్టుగా కేంద్ర మంత్రి గోయల్ రైతులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నూకలు తినమని తెలంగాణ ప్రజలను కేంద్రం మంత్రి అవమానపరచడం సరికాదని, తెలంగాణ ప్రజలను నూకలు తినే పరిస్థితికి ఎప్పుడూ రానివ్వమని తేల్చిచెప్పారు. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ, ప్రజల బాగోగులు చూసే పార్టీ టీఆర్ఎస్ అని, తెలంగాణ కోసం ప్రాణాలిచ్చే పార్టీ కూడా టీఆర్ఎస్ అని అన్నారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన మహాధర్నాలో పాల్గొన్న కార్యకర్తలు, టీఆర్ఎస్ శ్రేణులు, రైతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.