పెద్దకొత్తపల్లి, జనవరి 20 : కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్లో తెలంగాణకు చెందిన ఉపాధ్యాయుడు అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి అక్కడ జరిగిన సాహితీ సమ్మేళనంలో మొదటి స్థానంలో నిలిచారు. హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి 20 వరకు ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ వైజ్ఞానిక సైన్స్ లిటరేచర్ ఫెస్టివల్ నిర్వహించారు.
‘నవ భారత కల్పనల్లో సైన్స్, టెక్నాలజీ పాత్ర’ అనే అంశంపై దేశవ్యాప్తంగా పద్య పోటీలు ఆన్లైన్లో నిర్వహించగా నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల జెడ్పీహెచ్ఎస్లో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు రాజశేఖర్‌రావు ప్రతిభ చాటారు. దేశవ్యాప్తంగా 180 మందిని ఈ పోటీలకు ఎంపిక చేయగా తెలంగాణ నుంచి రాజశేఖర్‌రావు మాత్రమే ఎంపికయ్యారు. అక్కడ జరిగిన తుది సమ్మేళనంలో దేశవ్యాప్తంగా తొలిస్థానంలో నిలిచారు. ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఎడిషన్‌లో కూడా ఆ పద్యాన్ని ప్రచురించారు. ఈ సందర్భంగా రాజశేఖర్రావుకు జాతీయ బాల భవన్ ప్రతినిధి మధు పంత్, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ డైరెక్టర్ అరవింద్ రణడే అభినందన పత్రాన్ని అందజేశారు.