హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): గత ప్రభుత్వం.. అని ఇంకా ఎంత కాలమంటరు. మీరేం చేస్తరో చెప్పండి! బడ్జెట్ పద్దులపైనే మాట్లాడాలన్న నిబంధన కేవలం బీఆర్ఎస్కే వర్తిస్తుందా? మిగతా సభ్యులకు వర్తించదా? అంటూ బీఆర్ఎస్ సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ అసెంబ్లీలో అధికారపక్షాన్ని నిలదీశారు. అసెంబ్లీ ప్రారంభమైనప్పటి నుంచి అధికారపక్షం నుంచి మాట్లాడిన వారంతా గత ప్రభుత్వం అంటూ నిందించలేదా? అని ప్రశ్నించారు. బడ్జెట్ పద్దులపై చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతుండగా, మంత్రి శ్రీధర్‌బాబు కల్పించుకొని గత పాలనను ప్రస్తావించొద్దని, బడ్జెట్ పద్దులపైనే మాట్లాడాలని సూచించారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన తలసాని అధికారపక్షం తీరును ప్రస్తావించారు.
సభ ప్రారంభం కాగానే మాట్లాడిన సంజీవరెడ్డి గత ప్రభుత్వం అంటూ ధరణి గురించి మాట్లాడలేదా? అని ఉదహరించారు. మీరు అధికారంలోకి వచ్చి 15 నెలలైంది అని గుర్తుచేశారు. బీఆర్ఎస్ సభ్యులకు చెప్పే ముందు సభలోని సభ్యులందరికీ ఇదే సూచన చేయాలని హితవు పలికారు. గత పదేండ్లలో ఇదే సభలో కాంగ్రెస్ పాలనను బీఆర్ఎస్ విమర్శించిందని, అయినా తాను సభలోని అందరికీ సూచించినట్టు మంత్రి శ్రీధర్‌బాబు వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కల్పించుకొని నెహ్రూ, ఇందిరాగాంధీ.. బీహెచ్ఈఎల్, బీడీఎల్ కట్టినట్టు మీరు గత సభల్లో ప్రస్తావించలేదా? అంటూ ప్రశ్నించారు. గత పదేండ్లలో మేమిలా చేశాం.. మీరిలా చేయండి అంటూ సూచనలు మాత్రమే ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. ‘గతంలేకుండా వర్తమానం లేదు.. గతం తాలూకు రెఫరెన్స్ ఇస్తున్నట్టు’ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
14 నెలల్లో 22 మంది పోలీసుల ఆత్మహత్య: సబిత
హైదరాబాద్, మార్చి 26(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో 22 మంది పోలీసులు ఆత్మహత్య చేసుకున్నారని, ఇలా ఎందుకు జరుగుతున్నదో పరిశీలించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. పోలీసులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు వారిపై ఒత్తిడిని తగ్గించాలని సూచించారు. ఎన్నికల్లో ఓడిన నేతలకు ఎస్కార్ట్ ఇచ్చి పంపిస్తున్నారని విమర్శించారు. హోగార్డుల ఆరోగ్యాలు పాడవుతున్నాయని, గతంలో 30 శాతం అలవెన్స్ ఇచ్చామని, దీనిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. 2012 బ్యాచ్ ఎస్సైల ప్రమోషన్ల సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఆటోలలో సేఫ్టీ లేకుండా పోయిందని, గతంలో అమలు చేసిన ‘మై ఆటో సేఫ్’ను సమీక్షించాలని చెప్పారు.
ఆ ఇద్దరికీ రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి: సునీత
హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): ఇస్త్రీ చేస్తూ ఇటీవల మరణించిన ఇద్దరు రజక వృత్తిదారులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం అసెం బ్లీలోప్రత్యేకంగా ప్రస్తావించారు. రూ.300 కోట్ల విద్యుత్తు బకాయిలను విడుదల చేయాలని, రజక ఫెడరేషన్ నుంచి రుణాలు ఇప్పించాలని కోరారు. తన ఇంటిపై దాడిచేసిన వారిని పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి పెళ్లి కొడుకుల్లా చూసుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. ర్యాలీగా వచ్చి ఇంట్లోకి చొరబడి తన వాళ్లపై దాడి చేశారని తెలిపారు.
దాడి బాధ్యులను నేటికీ అరెస్టు చేయలేదు: పాడి
హైదరాబాద్, మార్చి 26(నమస్తే తెలంగాణ): తన ఇంటిపై జరిగిన దాడికి బాధ్యులైన వారిని నేటికీ పోలీసులు అరెస్టు చేయలేదని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సభ దృష్టికి తెచ్చారు. దాడి జరిగిన రోజున సైబరాబాద్ డీసీపీ, మాదాపూర్ ఏసీపీ, గచ్చిబౌలి సీఐ పైలట్ ఎస్కార్ట్ ఇచ్చి గూండాలను పంపి దాడి చేయించారని విమర్శించారు. ఎమ్మెల్యే అయిన తనపైనే ఇలాంటి దాడులు చేయిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఈరోజు తనపైన దాడి జరిగిందని, రేపు మీపైనా దాడులు జరుగుతాయని అధికారపక్ష ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తన ఇంటిపైనే దాడి జరిగితే, బెడ్రూం వద్దకొచ్చి తననే అరెస్ట్ చేసి పోలీస్‌స్టేసన్‌కు తీసుకెళ్లి తనపైనే ఉల్టా కేసు పెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. మరో అంశంలో ఆర్డీవోతో తనపై దొంగ కేసు పెట్టించి పండుగ రోజున అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పడుకోబెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు.