Talasani Srinivas Yadav | హైదరాబాద్ మహా నగరాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. గూగల్ మ్యాప్ ఆధారంగా హైదరాబాద్‌ను విభజించినట్లు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో కేపీ వివేకానందతో కలిసి తలసాని మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యం ఉందని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కానీ ఎంతో చరిత్ర ఉన్న సికింద్రాబాద్‌ను ఇష్టమొచ్చినట్లు విభజిస్తున్నారని మండిపడ్డారు. దీనికి వ్యతిరేకంగా ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, ఇతరత్రా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రకటించారు. మద్దతిచ్చే పార్టీలతో కలిసి నిరసన తెలుపుతామని పేర్కొన్నారు. టెక్నికల్ స్టడీ లేకుండానే ప్రాంతాలను విభజిస్తున్నారని అన్నారు.
జంట నగరాల ఉనికి లేకుండా కుట్ర చేస్తున్నారని తలసాని ఆరోపించారు. సికింద్రాబాద్ చరిత్రను, సంస్కృతిని నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు మార్చి చూడమని సీఎం రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు.
మహానగర విభజన పై కాంగ్రెస్ నాయకులకు కనీసం అవగాహన లేదని తలసాని విమర్శించారు. డివిజన్లను కూడా సరిగా విభజించలేదని అన్నారు. 24 నియోజకవర్గాలు ఉన్న మహానగరాన్ని విభజిస్తున్నప్పుడు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోలేదని తెలిపారు. ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం బిఆర్ఎస్ హయాంలో 150 డివిజన్లు చేశామని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహానగరాన్ని ఇష్టమొచ్చినట్లు విభజిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ పనుల కోసం ప్రజలు నగరం మొత్తం తిరిగే పరిస్థితి తీసుకొస్తున్నారని తెలిపారు. దీనిపై చట్టపరంగా, న్యాయపరంగా పోరాడతామని తెలిపారు.
అసెంబ్లీలో కూడా ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎంతోమంది ముఖ్య మంత్రులను, స్పీకర్లను చూశాం.. కానీ ఇలాంటి ముఖ్యమంత్రి, స్పీకర్‌ను చూడలేదని అన్నారు. స్పీకర్ కనీసం ప్రతిపక్ష సభ్యుల వైపు చూడటం లేదని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడడం ప్రతిపక్ష పార్టీ పని అని.. కానీ ప్రతిపక్ష పార్టీని స్పీకర్ నిలువరిస్తున్నారని అన్నారు. గంటన్నర పాటు రేవంత్ రెడ్డి బూతు పురాణం మాట్లాడుతున్న స్పీకర్ అడ్డు చెప్పలేదని మండిపడ్డారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా వత్తాసు పలికేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి మాటలకు చేతలకు పొంతనలేదని విమర్శించారు. అందరి అభిప్రాయాలు తీసుకుంటామని చెబుతూనే… అభిప్రాయం చెప్పకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.