Talasani Srinivas Yadav | అసెంబ్లీని కాంగ్రెస్ ఇష్టానుసారంగా నడిపిస్తుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. అక్రమ మైనింగ్‌పై హరీశ్‌రావు సభ దృష్టికి తీసుకొచ్చారని.. దానిపై హౌస్ కమిటీ వేయాలని కోరామని తెలిపారు. మేం హౌస్ కమిటీకి డిమాండ్ చేస్తే సీబీ సీఐడీ విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి అన్నారని తెలిపారు. మా డిమాండ్‌ను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం యత్నించిందని మండిపడ్డారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. పొంగులేటి అంశంపై సభాసంఘం వేయాలని డిమాండ్ చేశామని తెలిపారు. సభాసంఘం అంశాన్ని వదిలేసి సీఎం కులాల ప్రస్తావన తీసుకొచ్చారని పేర్కొన్నారు. కడియం, దానం ఏ పార్టీ సభ్యులని వారికి మాట్లాడే అవకాశం ఇచ్చారని ప్రశ్నించారు. మీరు ఏ పార్టీ వారో చెప్పాలని కౌశిక్ రెడ్డి అడిగారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అసెంబ్లీలో ఏ కమిటీలు లేవని తలసాని తెలిపారు. స్పీకర్‌ను దళితుడుఅని మేం ఎప్పుడూ భావించలేదని అన్నారు. ఉన్నతమైన వ్యక్తిగానే స్పీకర్‌ను గౌరవించామని పేర్కొన్నారు. మా డిమాండ్‌పై నిరసన తెలియజేస్తుంటే, అటెన్షన్ డైవర్ట్లో భాగంగా కులాలకు అంటగట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశాడని తెలిపారు. నా వెంట్రుక పీకలేరని కడియం శ్రీహరి వ్యవహారశైలి ఉందన్నారు. సబ్ ఆర్డర్ లేనప్పుడు అనేక అంశాలు జరుగుతుంటాయని చెప్పారు. భట్టి విక్రమార్క అంటే బీఆర్ఎస్కు గౌరవమని తెలిపారు. ఆనాడు భట్టి విక్రమార్క పాదయాత్ర చేశాడని ముఖ్యమంత్రి గుర్తుచేశాడని.. భట్టి విక్రమార్కను ముఖ్యమంత్రి చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. సభలో అధికార పార్టీ సభ్యుల చేత బీఆర్ఎస్ ను తిట్టించారని తెలిపారు. వెనుకబడి తరగతుల పద్దుల విషయంలో చర్చపై వాస్తవాలు బయటకొస్తాయనే డైవర్షన్ పాలిటిక్స్ ఏస్తున్నారని మండిపడ్డారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి వేల కోట్లు పెడుతున్నామని చెప్పి, వంద రూపాయల ఖర్చు చేయలేదని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మమ్మల్ని పండబెట్టి తొక్కుతామని అన్నాడని.. ఆ వ్యాఖ్యలను కూడా ఎథిక్స్ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశారు. ఒక మంత్రి ఏమో హౌస్ కమిటీకి అంగీకారం చెబుతాడు.. ముఖ్యమంత్రి ఏమో సీబీ సీఐడీ విచారణ చేయిస్తానని అంటున్నాడు తెలిపారు. మంత్రులకు, ముఖ్యమంత్రికి మధ్యనే సఖ్యత లేదని అన్నారు.
సభలో మాట్లాడటానికి బీఆర్ఎస్ సభ్యులకు మైక్ ఇవ్వడం లేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ప్రశ్నిస్తున్నామనే భయంతోనే బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారని తెలిపారు. కాంగ్రెస్ దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ పనితీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాహుల్‌గాంధీ రాజ్యాంగం పట్టుకుని దేశమంతా తిరుగుతున్నారని.. మరి ఆయనకు తెలంగాణలో అరాచకాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
యూరియా కోసం రైతులు క్యూలైన్లు కడుతున్నదని కనబడటం లేదా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఇచ్చిన హామీలు కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలే కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాతపెడతారని అన్నారు. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ సర్కార్‌కు తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. అంబేద్కర్ అభయహస్తం ఏమైందని ప్రశ్నించారు. గిరిజనులకు సబ్‌ప్లాన్ ఏమైందని అడిగారు.
కేసీఆర్ హయాంలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలిచిందని తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. రైతుబంధు, రైతుబీమాతో రైతులకు భరోసా కల్పించారని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆత్మగౌరవ భవనాలు నిర్మించారని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో పంజాబ్‌ను తలదన్నేలా తెలంగాణలో పంట దిగుబడి జరిగిందని చెప్పారు.