హైదరాబాద్: నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ప్రతిపాదించిన ఇథనాల్ కంపెనీకి, తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. తమకు వాటాలున్నాయని మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పీసీసీ అధ్యక్షుడు అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు వాటాలున్నాయని నిరూపిస్తే వాళ్లకే రాసిస్తానని చెప్పారు. ఇథనాల్ కంపెనీ వద్దని అక్కడి గ్రామస్తులు ధర్నాలు చేస్తున్నారని, దానిపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజమండ్రి దగ్గర ఒక డిస్టిలరీస్ కంపెనీలో 8 మంది డైరెక్టర్లలో ఒకరిగా నా కుమారుడు ఉన్నారని, 2016లోనే దానికి రాజీనామా చేశాడన్నారు. అదే ఏడాది ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఏపీలో ఒప్పందం కుదిరిందని, ఆ తర్వాత దానిని రద్దు చేసుకున్నారని తెలిపారు. పాత పేపర్ పట్టుకుని తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇథనాల్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. దానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వమే అనుమతి ఇచ్చినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీపై బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమన్నారు. లగచర్లలో కేటీఆర్ కుట్ర చేశారని ప్రభుత్వం ఆరోపణలు చేసిందన్నారు. రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అయిందని, రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో వున్నారని చెప్పారు.
శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్ నిర్వహిస్తామని తలసాని చెప్పారు. రేపు ఉదయం నిమ్స్‌లో రోగులకు పండ్లు పంపిణీ చేస్తామన్నారు. సాయంత్రం 4 గంటలకు బసవతారకం కేన్సర్ హాస్పిటల్ నుంచి ర్యాలీ నిర్వహిస్తామన్నారు. తెలంగాణ భవన్లో హైదరాబాద్ దీక్షా దివస్ నిర్వహిస్తామని వెల్లడించారు. వేల మంది గులాబీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.
Live: Former Minister Sri @YadavTalasani addressing the Media at Telangana Bhavan https://t.co/sMfRklSqYp
— BRS Party (@BRSparty) November 28, 2024