హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సర్కార్ నడుస్తుందో, సరస్ నడుస్తుందో అర్థం కావడం లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ విమర్శించారు. తెలంగాణ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారం ఉందని రేవంత్‌రెడ్డి తన ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని, ఆయనపై కాంగ్రెస్ కక్షసాధింపు చర్యలను ప్రపంచమంతా గమనిస్తున్నదని పేర్కొన్నారు.
కేసీఆర్ ఎకడ ఉంటారో అందరికీ తెలుసునని, ఇటీవల ఇద్దరు మంత్రులు కూడా వెళ్లి ఆయనను కలిశారని గుర్తు చేశారు. సిట్ అధికారులు మాత్రం నందినగర్ నివాసానికి వచ్చి గోడకు నోటీస్ అతికించారని, ఇలా చేసి ఎవరిని కించపరుస్తున్నారని ఆయన మండిపడ్డారు. చట్టాన్ని గౌరవించడంతో పాటు విచారణకు సహకరిస్తానని కేసీఆర్ చెప్పినప్పటికీ ఇలా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. ఈ అంశంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకునే అవకాశం ఉన్నా, చట్టంపై గౌరవంతో కేసీఆర్ ఉన్నారని తెలిపారు.
అన్నింటికీ తెగించి ఉద్యమం చేసిన కేసీఆర్‌పై ఇంతటి కక్ష సాధింపా? అని తలసాని మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు గ్రహించాలని హితవు పలికారు. రాష్ట్రంలో కేసీఆర్‌పై సాగుతున్న కక్ష సాధింపును ఏఐసీసీ నాయకత్వం గమనిస్తున్నదా?.. లేదా ? అని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెండేండ్ల తర్వాత వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, ఒళ్లు దగ్గర పెట్టుకొని రాష్ర్టాన్ని పరిపాలించాలని కాంగ్రెస్ నేతలకు ఆయన సూచించారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలేనని స్పీకర్ తీర్పు చెప్పారని, మున్సిపల్ ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థుల కోసం పని చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయంలో అసెంబ్లీ స్పీకర్ ఎవరినైనా పంపించి వాస్తవాలు తెలుసుకోవచ్చునని కోరారు. దైవదర్శనానికి వెళ్లిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, బీఆర్ఎస్ నేతలు బొమ్మెర రామమూర్తి, కడారి స్వామియాదవ్, కార్పొరేటర్లు జగన్, సురేశ్‌రెడ్డి, సత్యనారాయణ, నాగరాజుయాదవ్ పాల్గొన్నారు.