‘ఈ సినిమాలో ప్రేక్షకులు ఊహించని సర్ప్రైజ్లు, ట్విస్ట్‌లు ఉంటాయి. అమ్మవారి ఆశీస్సులతో మీ ముందుకొస్తున్నాం. తప్పకుండా ఓ విభిన్న కథా చిత్రాన్ని చూసిన అనుభూతినిస్తుంది’ అన్నారు హీరో సుమంత్. ఆయన ఐశ్వర్యరాజేష్‌తో కలిసి నటిస్తున్న మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’ సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సుమంత్ మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.
ఇప్పటివరకూ రాని సరికొత్త కంటెంట్‌తో సినిమా తీశామని చిత్ర దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తెలిపారు. వారాహి మాత దైవిక శక్తుల నేపథ్యంలో అంతుచిక్కని సంఘటనలు, రహస్యాలతో సినిమా ఆద్యంతం ఉత్కంఠను పంచుతుందని నిర్మాత మధు పేర్కొన్నారు. అమ్మవారి పేరుతో రూపొందుతున్న సినిమాలో నటించడం ఆనందంగా ఉందని మీనాక్షి గోస్వామి చెప్పారు. మాళవిక నాయర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, నిర్మాతలు: కలిపు మధు, లక్ష్మణ్, దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి.