మేడ్చల్, జూలై 27 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంతో ఆర్భాటంగా నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇంటి పథకం కోసం స్వీకరించిన దరఖాస్తులను ప్రభుత్వం పాతర వేసింది. ప్రస్తుతం మళ్లీ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. గతంలో దరఖాస్తులు చేసుకున్న వారి పరిస్థితి ఏమిటన్నది అయోమయంగా మారింది. దరఖాస్తుదారుడు రూ. 10 వేల రుసుంతో మీ సేవాలో చేసుకోవాల్సి ఉంటుంది.
ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసేదే నిరుపేదలకు మరి నిరుపేదలు ఇందిరమ్మ ఇంటికి ఎలా రుసుం చెల్లించి దరఖాస్తులు చేసుకుంటామని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లను జీప్లస్ 10గా నిర్మించేందుకు స్థలాలను అధికారులు గుర్తించారు. మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి పోచారం, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గాజులరామారం, మల్కాజిగిరి నియోజకవర్గంలో కౌకుర్, కూకట్‌పల్లిలో కేపీహెచ్‌బీ హౌజింగ్‌బోర్డులో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనున్నారు. అయితే నియోజకవర్గానికి జీప్లస్10గా 480 ఇండ్లను నిర్మించనున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.
అత్యధికంగా దరఖాస్తులు వస్తే లాటరీ ద్వార లబ్ధిదారులను ఎంపిక చేసిన అనంతరం రూ. 6 లక్షలు చెల్లిస్తే ఇండ్లను ప్రభుత్వం కేటాయించనున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని ప్రశ్నిస్తున్నారు. కాగా దరఖాస్తులను మరో 15 రోజుల వరకు స్వీకరిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను ఉచితంగా అర్హులైన నిరుపేదలకు కేటాయించిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రూ. 6 లక్షలు చెల్లిస్తే రూ. 5 లక్షల సబ్సిడీని కలిపి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తామని చెబుతున్న క్రమంలో నిరుపేదలు సర్కార్‌పై నిప్పులు కక్కుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లాగే ఉచితంగానే ఇండ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.