హైదరాబాద్, జులై 27 (నమస్తే తెలంగాణ): పేదల ఇండ్లపై ప్రతాపం చూపేందుకు అధికారంలోకి వచ్చిన నెలలోపే 99 జీవో ద్వారా రేవంత్‌రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని, దానిపై హైకోర్టు తీర్పు రేవంత్‌రెడ్డికి చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి రాజ్యంలో ‘మంచి’ పోస్టింగ్‌ల కోసం అడ్డదారులు తొకితే చర్లపల్లి – చంచల్‌గూడ జైళ్లకే కొందరు అధికారులు పరిమితమయ్యే ప్రమాదం ఉన్నదని, అధికారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
రాష్ట్రంలో హైడ్రా వ్యవహారం, హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన తెలంగాణ భవన్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైడ్రా కమిషనర్‌ను వెంటనే తొలగించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని చెప్పారు. నాడు హిట్లర్ యూదులను ఏవిధంగా నిర్మూలించాడో, నేడు రేవంత్‌రెడ్డి హైడ్రాను అడ్డం పెట్టుకొని పేదల ఇండ్లను అదే రీతిలో తొలగిస్తున్నాడని, హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకొనే హైడ్రాను తెచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై ఏకంగా 63 కోర్టు ధికరణ కేసులు ఉండటం ప్రభుత్వ క్రూరత్వానికి అద్దం పడుతున్నదని ఆర్ఎస్పీ విమర్శించారు. లోతుకుంట, బహదూర్‌గూడ, అమీన్పూర్లో హైడ్రా చేసిన అరాచకాల చిట్టా చాలా పెద్దదని పేరొన్నారు. పేదలకో న్యాయం.. రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇంటికో న్యాయమా? అని ప్రశ్నించారు. హైడ్రాను అడ్డం పెట్టుకొని రేవంత్ రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నాడని దుయ్యబట్టారు.
హైడ్రాను అడ్డుకునేందుకు ఆర్మీని రంగంలోకి దించాలని హైకోర్టు అన్నదంటే, అసలు రాష్ట్రంలో పాలన ఉన్నదా? అని ఆర్ఎస్పీ అనుమానం వ్యక్తంచేశారు. రంగనాథ్‌ను ఎప్పుడో అరెస్టు చేయాల్సిందని, హైకోర్టు కొంత దయ చూపించిందని వ్యాఖ్యానించారు. ఈ రోజు రంగనాథ్, రేపు డీజీపీ, సీసీఎల్ఏ కూడా కోర్టు గుమ్మం ఎకాల్సి వస్తుందని హెచ్చరించారు. రంగనాథ్ పోయి వేరే అధికారి వచ్చినా రేవంత్ తీరు మారకపోతే హైడ్రా తీరు మారదని స్పష్టంచేశారు. అధికారులు రూల్ బుక్ ప్రకారం చట్టబద్ధంగా ఉద్యోగం చేయాలని సూచించారు. తప్పులు చేస్తున్న అధికారులందరిపై బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక చర్యలు ఉంటాయని, ప్రతి ఫైల్‌నూ శోధిస్తామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తొలిరోజే హైడ్రాను రద్దు చేస్తామని తమ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారని, అది జరిగి తీరుతుందని తేల్చిచెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి రియల్ ఎస్టేట్ ఉచ్చులో అధికారులు పడొద్దని ఆర్ఎస్పీ హితవు పలికారు. రాష్ట్రంలో అధికారులు ప్రభుత్వాధినేతల అక్రమ ఆదేశాలను సున్నితంగా తిరసరించాలని, రాజ్యాంగంలోని 311వ అధికరణం అధికారులకు రక్షణ కల్పిస్తుందని ఎక్స్‌వేదికగా గుర్తుచేశారు.
చేవెళ్ల టౌన్, జూలై 27 : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ డిక్లరేషన్‌పై ఆగస్టు రెండోవారంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగా సభ నిర్వహిస్తున్నట్టు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సోమవారం ఆయన చేవెళ్లలో మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని అన్నారు. ఆగస్టు రెండో వారంలో జరిగే భారీ బహిరంగ తేదీని త్వరలోనే పార్టీ అధిష్ఠానం ప్రకటిస్తుందని తెలిపారు.