హైదరాబాద్: అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్పు ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) డిమాండ్ చేశారు. శనివారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ కార్పొరేటర్లతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పేద ప్రజలు, నిరుద్యోగుల ఆకలి తీర్చాలనే మంచి ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాణ్యమైన భోజనం రూ.5 అందించే విధంగా అన్నపూర్ణ క్యాంటీన్లను ప్రారంభించినట్లు వివరించారు.
హైదరాబాద్ నగర వ్యాప్తంగా 150 వరకు ఉన్న క్యాంటీన్ల సంఖ్యను పెంచక పోగా ఉన్న పేర్లను మార్చాలని ప్రయత్నించడం బాధాకరం అన్నారు. ఎంతో మంది ఆకలి తీర్చే అన్నపూర్ణ తల్లి పేరును క్యాంటీన్‌కు నామకరణం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పేరు పెట్టాలని చూస్తుందని, ఏం ఉద్ధరించారని ఆ పేరు పెడతారని ప్రశ్నించారు. 150 క్యాంటీన్లలో ఇప్పటి వరకు 20 మూతపడితే పట్టించుకోలేదని విమర్శించారు. మీరు కొత్త కార్యక్రమాలు చేపట్టి మీకు నచ్చిన పేరు పెట్టుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు. ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలు అన్నారు. అనేక హామీలు ఇచ్చారని, వాటిని అమలు చేయకుండా పేర్లు మారుస్తామని అనడం ఎంత వరకు సమంజసం అన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య శ్రీని కేసీఆర్ ప్రభుత్వం కొనసాగించలేదా అని ప్రశ్నించారు. లక్షలాది మంది ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణ క్యాంటీన్లకు మీ పార్టీ నాయకుల పేర్లు పెడతామంటే అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.
వెంటనే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి చర్చ జరపాలని, అన్ని పార్టీల సభ్యుల అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.