జగిత్యాల/కరీంనగర్ కార్పొరేషన్, ఏప్రిల్ 19 : కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉంటారని పదే పదే విమర్శించే కాంగ్రెస్ నాయకులకు.. ఇ ప్పుడు కేసీఆర్ బయటకు వస్తుంటే వణుకు పుడుతున్నదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆ యన కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. అనంతరం జగిత్యాలకు వెళ్లి ఎమ్మెల్సీ ఎల్ రమణ తో కలిసి మాజీ మంత్రి జీవన్‌రెడ్డిని కలిశారు.
ఆ తరువాత జగిత్యాల సభ ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. కేసీఆర్ బయటకు వస్తున్నారనే సీఎం రేవంత్‌రెడ్డి మేడిగడ్డ సందర్శన పేరుతో డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పరిపాలన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని అన్నారు.
కేసీఆర్ ప్రజల్లోకి వస్తుండటంతో అధికార పార్టీ కొత్త హామీలు ఇస్తున్నదని ఎద్దేవా చేశా రు. జగిత్యాల సభతో కేసీఆర్ బయటికి వస్తున్నాడని భయం పుట్టి.. రేపో, ఎల్లుండో రైతుభరోసా వేస్తామని సర్కార్ ప్రకటించడం హా స్యాస్పదమన్నారు. రాష్ట్రంలో ప్రజలకు పనికివచ్చే ఏ ఒక ప్రాజెక్టు కట్టకుండానే ఈ రెండున్నరేండ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.3.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలకు బడ్జెట్లో కేటాయింపులు చేసిన 5 శాతం కూడా వ్యయం చేయడం లేదని దుయ్యబట్టారు.
కులగణన పూర్తిగా తప్పుల తడకగా ఉన్నదని, బడుగు, బలహీన వర్గాల గురించి తప్పుడు లెక్కలను చూపించారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు, యువత, విద్యార్థులు, మహిళలు అందరూ మోసపోయామని అనుకుంటున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని తెలుసుకున్నారని పేర్కొన్నారు. తగిన సమయంలో బుద్ధిచెప్పడానికి వారంతా సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. సోమవారం జగిత్యాలలో జరిగే ప్రజా ఆశీర్వాద సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.