హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జాతిపిత, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17న పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. కేసీఆర్ 71వ జన్మదినం సందర్భంగా ఆ రోజు ఉదయం 10 గంటలకు 71 కిలోల భారీ కేక్ కట్ చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో పదేండ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై వీడియో గీతాల ప్రదర్శన, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కళాకారుల ఆటపాటలు, డప్పు చప్పుళ్లు, గిరిజన నృత్యాలు, ఉద్యమ స్ఫూర్తిని రలిగించిన గీతాల ప్రదర్శన ఉంటుందని వెల్లడించారు.
వివిధ రకాల తెలంగాణ వంటలతో విందు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం పార్టీ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, నాయకులు బొమ్మెర రామ్మూర్తి, పవన్, కార్పొరేటర్లు మన్నె కవితారెడ్డి, వెంకటేశ్‌తో కలిసి తలసాని మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ జీవిత విశేషాలతో ప్రత్యేక సీడీని విడుదల చేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రక్తదానాలు, పండ్ల పంపిణీతోపాటు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. కేసీఆర్ ఆయురారోగ్యాలను కాంక్షిస్తూ దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో బీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమాలను పార్టీ కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
14 ఏండ్లు అలుపెరగని పోరు
60 ఏండ్ల ప్రత్యేక రాష్ట్ర సాధన కలను 14 ఏండ్లు అలుపెరుగకుండా పోరాడి కేసీఆర్ సాధించారని తలసాని గుర్తుచేశారు. కొట్లాడి సాధించిన రాష్ర్టాన్ని పదేండ్ల పాలనలో దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దారని ప్రశంసించారు. అంతటి మహానుభావుడు, కారణజన్ముడు కేసీఆర్ పుట్టిన రోజు అంటే తెలంగాణ ప్రజలందరికీ పండుగ రోజు అని చెప్పారు. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఊరూరా బీఆర్ఎస్ శ్రేణులు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ప్రతి డివిజన్లో రక్తదాన శిబిరాలు వంటి సేవ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. కేసీఆర్ పాలనాదక్షతను పార్టీ ముఖ్య నేతలతోపాటు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, జిల్లా, మండలస్థాయి నాయకులు కార్యకర్తలతో కలిసి వెలుగెత్తి చాటేలా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
సర్వే పూర్తిగా చేయాల్సిందే
కుట్ర పూరితంగా కులగణన చేశారని, మళ్లీ పూర్తిగా సర్వే చేయాలని తలసాని డిమాండ్ చేశారు. గ్రామాలు, పట్టణాల్లో సర్వే ఎకడా సరైన రీతిలో జరగలేదని, 60 లక్షల జనాభాను తకువ చేసి చూపారని మండిపడ్డారు. ఓటర్ లిస్ట్, కుటుంబ సమగ్ర సర్వే ప్రకారం చూసినా కులగణన లెకలు తప్పుగా ఉన్నాయని స్పష్టంచేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై అసెంబ్లీలో చట్టబద్ధత చేస్తే లాభం లేదని కేంద్రం నిర్ణయం తీసుకోవాలని, కేసీఆర్ గతంలోనే బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీ తీర్మానం చేశారని గుర్తుచేశారు.